ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖపై నాకు ఏమాత్రం అవగాహన లేదు: ఏబీ వెంకటేశ్వరరావు

  • ఏబీవీకి ఇటీవలే పోస్టింగ్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
  • ప్రింటింగ్ శాఖను ప్రాధాన్యత లేని పోస్టింగ్ గా భావించడం లేదన్న ఏబీవీ 
  • ప్రభుత్వం తన ఆలోచనల మేరకు చేస్తుందని వ్యాఖ్య
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా ఆయనను నియమిస్తూ జూన్ 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు మూడేళ్ల అనంతరం ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. మరోవైపు ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖ పట్ల తనకు పూర్తి అవగాహన లేదని చెప్పారు. 

ముత్యాలంపాడులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ కు గతంలో ఎంతో కీర్తి ఉండేదని అన్నారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు కూడా ఇక్కడ ప్రింట్ అయ్యేవని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ విభాగంలోని స్థితిగతులపై అధ్యయనం చేస్తానని... ఇక్కడి సిబ్బందితో చర్చించి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. దీన్ని ప్రాధాన్యత లేని పోస్టింగ్ గా తాను భావించడం లేదని చెప్పారు. ఉద్యోగుల నియామకాల విషయంలో ప్రభుత్వం తన ఆలోచనల మేరకు చేస్తుందని అన్నారు.


More Telugu News