ఇలా చేస్తే.. ఆన్ లైన్ బ్యాంకింగ్ మోసాల నుంచి రక్షణ

  • పాస్ వర్డ్ పటిష్ఠంగా ఉండాలి.. తరచూ మారుస్తుండాలి
  • సున్నితమైన వివరాలు ఎవ్వరితోనూ షేర్ చేయకూడదు
  • తెలియని వెబ్ లింక్ లను క్లిక్ చేయకుండా ఉంటేనే మంచిది
బ్యాంకు లావాదేవీల కోసం నేడు బ్యాంకు శాఖల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్ నుంచి, సిస్టమ్ నుంచి నెట్ బ్యాంకింగ్ ద్వారా దాదాపు ఎక్కువ సేవలను పొందొచ్చు. సేవల డిజిటైజేషన్, బ్రాడ్ బ్యాండ్ అందుబాటు వల్ల ఈ సదుపాయం ఏర్పడింది. దాదాపు అన్ని లావాదేవీలనూ డిజిటల్ గానే చేస్తున్నాం. బ్యాంకుకు వెళ్లి చేసే లావాదేవీలు చాలా వరకు తగ్గిపోయాయి. దీనివల్ల మోసాలు కూడా పెరిగిపోయాయి. నెట్ బ్యాంకింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మోసాలకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవచ్చు.

పాస్ వర్డ్
నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ ను తరచూ మార్చుకోవడం రక్షణ కోణంలో మంచి చర్య అవుతుంది. దాదాపు చాలా బ్యాంకులు ఇప్పుడు తప్పనిసరిగా పాస్ వర్డ్ మార్చుకోవాలని కోరుతున్నాయి. కొన్ని బ్యాంకులు మూడు నెలలు, కొన్ని ఆరు నెలలకోసారి మార్చుకోవాలని అడుగుతున్నాయి. కానీ, నెలకు ఒకసారి పాస్ వర్డ్ మార్చుకోవడం మరింత మంచిది. బలమైన పాస్ వర్డ్ (క్యాపిటల్, స్మాల్ లెటర్స్, స్పెషల్ కేరక్టర్, నంబర్) పెట్టుకోవాలి. దానిని ఎవ్వరితోనూ షేర్ చేయకూడదు.

కంప్యూటర్లు
ఇంట్లో, కార్యాలయంలోని కంప్యూటర్ల ద్వారానే నెట్ బ్యాంకింగ్ లాగిన్, లావాదేవీలకు పరిమితం కావాలి. కార్యాలయాల్లో కంప్యూటర్లకు బలమైన రక్షణ వ్యవస్థ సహజంగానే ఉంటుంది. ఇంట్లో వ్యక్తిగత కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లోనూ యాంటీ వైరస్, హ్యాకింగ్ రక్షణ సాఫ్ట్ వేర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇతరుల కంప్యూటర్లు వాడకుండా ఉండడం మంచిది. హ్యాకర్లు వివిధ సాఫ్ట్ వేర్ల ద్వారా లాగిన్ వివరాలను కొట్టేసి, మోసాలకు పాల్పడుతుంటారు. కనుక నెట్ కేఫ్, జిరాక్స్ సెంటర్లు, ఇతర ప్రాంతాల్లోని కంప్యూటర్లకు దూరంగా ఉండాలి.

బహిరంగ ప్రదేశాలలో వైఫై
బహిరంగ వైఫై, ఉచిత వైఫై నెట్ వర్క్ లను ఉపయోగించుకుని నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు చేసుకోవద్దు. ఎందుకంటే ఆయా బహిరంగ నెట్ వర్క్ ల్లో రక్షణ పాళ్లు తక్కువ. దీనివల్ల ఈ నెట్ వర్క్ నుంచి చేసే సమాచారం హ్యాకర్లకు చేరుతుంది. అంతేకాదు, ఇంట్లోని సొంత వైర్ లెస్ నెట్ వర్క్ కు సైతం బలమైన పాస్ వర్డ్ ను పెట్టుకోవాలి. 

ఫిషింగ్ స్కామ్ లు
ఈ మెయిల్స్, కాల్స్, మెస్సేజ్ ల రూపంలో ఆర్థిక సమాచారం తెలుసుకునే మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతుంటారు. బ్యాంకు ఉద్యోగి పేరుతో ఓటీపీ అడగడం, రివార్డులు క్లెయిమ్ చేసుకోవాలని, ఓటీపీ కోరడం ఇలా ఎన్నో మార్గాల్లో మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. వారు అడిగిన సమాచారం ఇస్తే.. సులభంగా మన బ్యాంకు ఖాతాను యాక్సెస్ చేయగలరు. అందుకని ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ ల ద్వారా వచ్చే లింక్ లపై క్లిక్ చేయకండి. కాల్ చేసి ఎవరు అడిగినా బ్యాంకు, కార్డుల సమాచారం, ఓటీపీ, ఆధార్, పాన్ వివరాలు పంచుకోవద్దు.

కార్డులు
క్రెడిట్/డెబిట్ కార్డులను స్వైప్ చేసే సందర్భాల్లో పరిశీలనగా చూడాలి. ఎందుకంటే కార్డు వివరాలను వారు కాపీ చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఏటీఎం కేంద్రాల్లోనూ కార్డు పెట్టే చోటే క్లోనింగ్ మెషిన్ ఉందేమో గమనించాలి. మీ కార్డు మరొకరికి ఇవ్వకుండా ఉండడమే రక్షణ.


More Telugu News