హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ ‘నిమిషాల్లోనే రూపం మార్చేసేది’..: జ్యూరీ సభ్యుడు

  • మళ్లీ రెండు సెకన్లలోనే స్థిమితపడేదన్న న్యాయమూర్తి
  • తమ వైపు చూస్తూ ఏడవడం వల్ల అసౌకర్యానికి గురైనట్టు వెల్లడి
  • జానీడెప్ చెప్పింది వాస్తవికంగా ఉందన్న అభిప్రాయం
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాలీవుడ్ నటులు జానీ డెప్-అంబర్ హెర్డ్ కేసు పూర్వాపరాలపై ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. ఈ కేసులో జానీడెప్ కు అనుకూలంగా జ్యూరీ తీర్పు జారీ చేయడం తెలిసిందే. ఈ తీర్పు వెనుక తాము పరిశీలించిన అంశాలను తీర్పు ఇచ్చిన జ్యూరీలో (ఏడుగురు సభ్యులు) ఒకరు వెల్లడించారు. నిమిషాల్లోనే అంబర్ హెర్డ్ ప్రవర్తన మారిపోయేదని, ఆ సమయంలో తాము ఎంతో అసౌకర్యానికి గురైనట్టు చెప్పారు. జానీడెప్ వాస్తవికంగా, నమ్మదగిన విధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

‘‘జ్యూరీవైపు చూస్తూ ఆమె ఏడవడం.. ముఖ హావభావాలు మమ్మల్ని అందరినీ ఎంతో ఇబ్బందికి గురి చేశాయి. ఆమె ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చి వెంటనే ఏడ్చేసేది. రెండు సెకన్ల తర్వాత మళ్లీ ప్రశాంతంగా మారిపోయేది. మాలో కొంత మంది ఆమె భావాలను చూసిన మొసలి కన్నీరుగా భావించారు’’ అని అంబర్ హెర్డ్ గురించి వివరించారు.

జానీడెప్ గురించి మాట్లాడుతూ.. ‘‘అతను చెప్పేది మరింత నమ్మశక్యంగా ఉందని జ్యూరీలో ఎక్కువ మంది భావించారు. ప్రశ్నలకు స్పందించే తీరు కూడా ఎక్కువ వాస్తవికంగా ఉండేది. అతడి భావోద్వేగాల స్థితి కూడా స్థిరంగా ఉండేది’’ అని జ్యూరీ తెలిపారు. జానీ డెప్, అంబర్ హెర్డ్ ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు దూషించుకున్నట్టు జ్యూరీ నమ్మినట్టుగా చెప్పారు. కానీ, ఆ నిందలు భౌతికంగా ఉన్నట్టు హెర్డ్ నిరూపించడంలో విఫలమైనట్టు పేర్కొన్నారు. 

ఇటీవలే అంబర్ హెర్డ్.. జ్యూరీ తీర్పు వాస్తవ అంశాలకంటే జానీడెప్ నటన ఆధారంగానే ఉందంటూ విమర్శించడం తెలిసిందే. జానీడెప్ అద్భుతమైన నటుడు అంటూ వెటకారంగా వ్యాఖ్యానించింది.


More Telugu News