రంగంలోకి అమిత్​ షా.. సికింద్రాబాద్​ అల్లర్లపై కిషన్​ రెడ్డికి ఫోన్​!

  • ఘటనపై ఆరా తీసిన కేంద్ర హోం మంత్రి
  • ఆందోళనలు దక్షిణాదికి చేరడంతో అప్రమత్తం
  • ఈ పథకంతో యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న షా
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉదయం జరిగిన విధ్వంసంపై  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ అయిన కిషన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. హింసకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీసినట్టు సమాచారం. 

    ఇప్పటిదాకా ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితం అయిన ఆందోళనలు క్రమంగా దక్షిణాదికి చేరడంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. వీటికి చెక్ పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే అగ్నిపథ్ పథకంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు అమిత్ షా సహా పలువురు కేంద్రం మంత్రులు మీడియా, సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు.

  కరోనా కారణంగా గత రెండేళ్లలో ఆర్మీ నియామకాలకు ఆటంకం కలిగిందని అమిత్ షా అన్నారు. సైన్యంలో చేరాలనుకునే యువకుల ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఏడాది అభ్యర్థుల వయో పరిమితిలో రెండేళ్ల సడలింపు కల్పించారని చెప్పారు. ఈ పథకంతో పెద్ద సంఖ్యలో యువతకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. దేశానికి సేవ చేసే అవకాశంతో పాటు వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని షా పేర్కొన్నారు.


More Telugu News