వాయు కాలుష్యంతో 5 ఏళ్ల ఆయు క్షీణత

  • పీఎం 10, పీఎం 2.5 కాలుష్యంలో భారీ వృద్ధి
  • దక్షిణాసియాలో భారత్ లో అధిక కాలుష్యం
  • ప్రపంచ కాలుష్య పట్టణాల్లో ఢిల్లీ
  • ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ విడుదల
కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేసినప్పుడే ఆరోగ్య భారత్ సాధ్యపడుతుంది. పొగతాగడం, మద్యపానం సేవించడం, సురక్షితం కాని నీరు తాగడం ఆరోగ్యానికి చేటు అన్న విషయం తెలిసిందే. కానీ, వాయు కాలుష్యం వీటన్నింటి కంటే ఎక్కువ ప్రమాదం. పొగతాగడం వల్ల ఆయువు రెండున్నరేళ్లు తగ్గిపోతుంటే.. సురక్షితం కాని నీటిని సేవించడం వల్ల ఏడాది పాటు జీవన కాలం క్షీణిస్తోంది. కానీ, వాయు కాలుష్యం వీటిని మించి ఏకంగా జీవన కాలాన్ని ఐదేళ్లు తగ్గిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను చేరుకోకపోతే ఒక్కో వ్యక్తి సగటు జీవన కాలం ఐదేళ్లు కోల్పోవాల్సి వస్తుందని ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’ చెబుతోంది. దక్షిణాసియా ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యంతో ఉంది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఈ నాలుగు దేశాల్లోనే ప్రపంచ జనాభాలో పావు వంతు నివసిస్తుండగా, ప్రపంచంలోని ఐదు అత్యధిక కాలుష్య దేశాల్లో ఈ నాలుగూ ఉండడం గమనించాలి.
 
2013 నుంచి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యంలో భారత్ వాటా 44 శాతం ఉందని ఈ ఇండెక్స్ చెబుతోంది. దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ సగటు పీఎం 2.5 కాలుష్యం 107 దాటి పోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితుల కంటే ఇది 21 రెట్లు ఎక్కువ. 2022 నుంచి చూస్తే మహారాష్ట్రలో 68.4 శాతం, మధ్యప్రదేశ్ లో 77.2 శాతం చొప్పున కాలుష్యం పెరిగింది. దీనివల్ల అక్కడి ప్రజలు సగటున 1.5-2.2 ఏళ్ల ఆయుష్షును కోల్పోతున్నారు.  

పీఎం 10, పీఎం 2.5
ధూళి/కాలుష్య రేణువుల పరిమాణమే పీఎం 10, పీఎం 2.5. ఇవి వాటి సైజును ప్రతిఫలిస్తాయి. పీఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. పీఎం 10 అంటే.. 10 మైక్రో మీటర్ల కంటే తక్కువ వ్యాసార్థంతో కూడిన కణాలు. ఇవి మన ముక్కులో రక్షణగా ఉండే వెంట్రుకలను దాటుకుని ఊరిపితిత్తుల్లోకి చేరతాయి. దీనివల్ల పలు శ్వాసకోశ సమస్యలు తలెత్తుతుంటాయి. పీఎం 2.5 మరింత ప్రమాదకరం. 2.5 మిల్లీ మీటర్ల వ్యాసార్థంతో ఉంటాయి. అంటే మన వెంట్రుక పరిమాణంలో కేవలం 3 శాతమే ఉంటాయి. ఇవి వాయుకోశాల ద్వారా రక్తంలోకి చేరతాయి. రక్త ప్రసారానికి అడ్డుపడి, స్ట్రోక్, గుండెపోటు, ఇతర సమస్యలకు కారణమవుతాయి.


More Telugu News