నా చుట్టూ మగ పోలీసులను ఎందుకు మోహరించారో చెప్పండి?: రేణుకా చౌదరి

  • ఈడీ విచారణ ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ
  • హైదరాబాదులో కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు
  • రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తం
  • ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి
  • కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
రాహుల్ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ రాజ్ భవన్ ను ముట్టడించాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల్లో కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి పంజాగుట్ట ఎస్సై ఉపేంద్రబాబు కాలర్ పట్టుకున్నారు. దీనిపై ఎస్సై ఉపేంద్రబాబు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రేణుకా చౌదరిపై ఫిర్యాదు చేయగా, ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు గోల్కొండ పీఎస్ కు తరలించారు. ఈ ఘటనపై రేణుకా చౌదరి వివరణ ఇచ్చారు. 

"పోలీసు యూనిఫాం అంటే ఏంటి, ఎలా గౌరవించాలనేది మాకూ తెలుసు. అదే సమయంలో పోలీసులు మాకు కూడా గౌరవం ఇవ్వాలి. నా చుట్టూ ఎందుకు మగ పోలీసులను మోహరించారు? పోలీసులపై దాడి చేయాలని నాకెలాంటి ఉద్దేశం లేదు. నన్ను నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో అదుపుతప్పి పోలీసులపై పడిపోయాను. కావాలంటే విజువల్స్ చూడండి. నన్ను నెట్టివేయడంతో ఆసరా కోసం అతడి భుజాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాను... అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా అతడి కాలర్ పట్టుకోలేదు. వీడియో చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. దురదృష్టవశాత్తు... తప్పుదోవపట్టించేలా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ నేతలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది" అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.


More Telugu News