టీపీసీసీ అధికార ప్రతినిధి కిరణ్ చామలపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు... వీడియో ఇదిగో!

  • నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీపై విచారణ
  • దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
  • హైదరాబాదులో హింసాత్మకం
  • వీడియో పంచుకున్న తెలంగాణ కాంగ్రెస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ గత కొన్నిరోజులుగా విచారిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపడుతోంది. అయితే, హైదరాబాదులో టీపీసీసీ చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మక రూపుదాల్చింది. తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు రాజ్ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేయగా, పోలీసులు లాఠీచార్జి చేశారు. 

టీపీసీసీ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ చామలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. కిరణ్ ను చుట్టుముట్టిన పోలీసులు లాఠీ దెబ్బలు రుచిచూపించారు. దీనికి సంబంధించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పంచుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా రాజ్ భవన్ వద్ద నిరసనలు తెలుపుతున్న తమ అధికార ప్రతినిధిని పోలీసులు దారుణంగా కొట్టారని పేర్కొంది. తమ నేతలపై ఇంత కిరాతకంగా దాడులకు పాల్పడడాన్ని ఖండిస్తున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ వెల్లడించింది. 

కాగా, కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ వైపు వెళ్లకుండా పోలీసులు ఖైరతాబాద్ నుంచి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ కార్యకర్తలు ఖైరతాబాద్ లో బైక్ ను అగ్నికి ఆహుతి చేసి నిరసన తెలిపారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసి, బస్సు పైకి ఎక్కి నినాదాలు చేశారు. 

పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. ఈడీ ఆఫీసు ముందు తాము రెండ్రోజులు శాంతియుతంగా నిరసనలు తెలిపామని, నేడు కూడా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నామని వెల్లడించారు. కానీ, పోలీసులు అడ్డుకోవడం వల్లే బైక్ దగ్ధం, బస్సు అద్దాల ధ్వంసం ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అటు పోలీసులు జగ్గారెడ్డిని, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేశారు.


More Telugu News