యూపీలో అక్రమ కట్టడాల కూల్చివేతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • చట్ట ప్రకారమే కూల్చివేతలు జరగాలన్న సుప్రీం 
  • ప్రతీకారాత్మకంగా ఉండకూడదన్న ధర్మాసనం
  • దీనిపై తాము స్టే విధించలేమని పిటిషనర్ కు స్పష్టీకరణ
  • స్పందన తెలియజేయాలని యూపీ సర్కారుకు నోటీసులు
ఉత్తరప్రదేశ్ సర్కారు అక్రమ కట్టడాల కూల్చివేతలో అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు గురువారం వాదనలు జరిగాయి. కట్టడాల కూల్చివేతలకు ముందు నిర్ణీత విధానాన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతా చట్టబద్ధంగానే జరగాలని పేర్కొంది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పూర్ లో అల్లర్లు చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రయాగ్ రాజ్ అల్లర్ల వెనుక ప్రధాన సూత్రధారి ఇంటికి అక్కడి మున్సిపల్ యంత్రాంగం నోటీసు జారీ చేసి, పాక్షికంగా కూల్చివేసింది. 

దీంతో జమైత్ ఉలేమా ఇ హింద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సహజ న్యాయ సూత్రాలను యూపీ సర్కారు గౌరవించడం లేదని పేర్కొంది. ముందుగా నోటీసు ఇచ్చి, ప్రాపర్టీ యజమానుల వాదన వినాల్సి ఉంటుందని గుర్తు చేసింది. ఓ మత వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సర్కారు వ్యవహరిస్తున్నట్టు పిటిషనర్ ఆరోపణలు చేశారు. నోటీసు ఇచ్చిన తర్వాత కనీసం 15-40 రోజుల గడువు ఇవ్వాలని పేర్కొన్నారు. 

అయితే, ఏ మత వర్గాన్ని కూడా తాము లక్ష్యంగా చేసుకోవడం లేదని యోగి ఆదిత్యనాథ్ సర్కారు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ప్రయాగ్ రాజ్, కాన్పూర్ లో కూల్చివేతలకు ముందు నిబంధనల మేరకు నోటీసులు ఇచ్చినట్టు చెప్పింది. యూపీ సర్కారు తరఫున అడ్వొకేట్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ‘‘కూల్చివేతలపై స్టే విధించలేము. చట్టప్రకారం నడుచుకోవాలని ఆదేశించగలం. కూల్చివేతలన్నవి చట్టం పరిధిలోనే జరగాలి. ప్రతీకారాత్మకంగా ఉండకూడదు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.


More Telugu News