ఎల్లుండితో శతవసంతంలోకి మోదీ మాతృమూర్తి.. హటకేశ్వర్ ఆలయంలో పూజలు చేయనున్న ప్రధాని

  • 18 జూన్ 1923న జన్మించిన హీరాబెన్ మోదీ
  • పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని
  • గాంధీనగర్‌లోని ఓ రోడ్డుకు ‘పూజ్య హీరా మార్గ్’ అని నామకరణం చేయనున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ ఈ నెల 18న శతవసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరగనున్న ఆమె పుట్టిన రోజు వేడుకల్లో మోదీ కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా వాద్‌నగర్‌లోని హటకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పావగఢ్‌లోని కాళీమాత ఆలయంలో జరిగే పూజల్లోనూ మోదీ పాల్గొంటారు. తల్లి శత వసంత పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని గాంధీనగర్‌లోని రైసన్ పెట్రోల్ పంపు నుంచి 60 మీటర్ల రోడ్డుకు ‘పూజ్య హీరా మార్గ్’ అని నామకరణం చేస్తారు. కాగా, హీరాబెన్ మోదీ 18 జూన్ 1923లో జన్మించినట్టు మోదీ సోదరుడు పంకజ్ మోదీ తెలిపారు. 

కొవిడ్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత మార్చి 11న ప్రధాని తన తల్లిని కలిశారు. కాగా, ఈ నెల 18న వడోదరలో పర్యటించనున్న మోదీ 4 లక్షల మంది పాల్గొనే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.  ప్రధాని గుజరాత్‌లో పర్యటించడం ఈ నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ నెల 10న తొలిసారి పర్యటించిన మోదీ.. నవ్‌సారి గిరిజన ప్రాంతంలో రూ. 3,050 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆ ప్రాంతంలో నీటి సరఫరాను మెరుగుపరచడానికి ఉద్దేశించిన 14కు పైగా ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.


More Telugu News