ఉపరాష్ట్రపతికి 3 నివేదిక‌లు అందించిన విజ‌య‌సాయిరెడ్డి... ఏపీకి ఓ కీల‌క ప్ర‌తిపాద‌న చేసిన వైసీపీ ఎంపీ

  • ఈ- కామ‌ర్స్ పార్ల‌మెంట‌రీ స్థాయీ సంఘం చైర్మ‌న్‌గా సాయిరెడ్డి
  • ఆ హోదాలోనే వెంక‌య్య‌తో సాయిరెడ్డి భేటీ
  • ఈ- కామ‌ర్స్ స‌హా తేయాకు ప‌రిశ్ర‌మ‌, ఎగుమ‌తి కేంద్రాలుగా జిల్లాలు అన్న అంశాల‌పై నివేదిక‌లు
  • ఏపీలో కొత్త జిల్లాల‌కూ వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రోడక్ట్ అనుమ‌తించాల‌ని సిఫార‌సు
భార‌త ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడును బుధ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఈ- కామ‌ర్స్‌కు సంబంధించి పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘం రూపొందించిన 3 నివేదిక‌ల‌ను ఆయ‌న వెంకయ్య‌కు అంద‌జేశారు. ఈ- కామ‌ర్స్‌పై పార్ల‌మెంట‌రీ స్థాయీ సంఘానికి సాయిరెడ్డే చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

దేశంలో ఈ- కామ‌ర్స్ రంగం వృద్ధి, డార్జిలింగ్‌లో తేయాకు ప‌రిశ్ర‌మ‌, ఎగుమ‌తి కేంద్రాలుగా జిల్లాలు అంశాల‌పై సాయిరెడ్డి నేతృత్వంలోని పార్ల‌మెంట‌రీ క‌మిటీ 3 నివేదిక‌ల‌ను రూపొందించింది. ఆ నివేదిక‌ల‌నే ఆయ‌న బుధ‌వారం వెంక‌య్య‌కు అంద‌జేశారు. దేశాన్ని 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీగా మార్చేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను కూడా ఈ నివేదిక‌ల్లో క‌మిటీ పొందుప‌ర‌చింది. 

ఇదిలా ఉంటే... ఎగుమ‌తి కేంద్రాలులుగా జిల్లాల‌ను గుర్తించాల‌ని ప్ర‌తిపాదించిన ఈ క‌మిటీ... ఏపీని దృష్టిలో పెట్టుకునే చేసింది. ఈ విష‌యాన్ని వెంకయ్య‌తో భేటీ త‌ర్వాత మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా సాయిరెడ్డే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కూడా వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రోడక్ట్ విధానాన్ని వర్తింపజేయాలని నివేదికలో ప్ర‌భుత్వానికి సిఫార్సు చేశామ‌ని సాయిరెడ్డి వెల్ల‌డించారు.


More Telugu News