ఒక్క ఓటమికే మార్పులు చేపట్టడం మూర్ఖత్వమే: దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా

  • భారత స్పిన్నర్లకు పరిస్థితులు అనుకూలించాయన్న దక్షిణాఫ్రికా కెప్టెన్
  • భారత బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారంటూ ప్రశంస
  • స్పిన్నర్లను ముందుగా దింపడం ఫలితాలను ఇచ్చిందన్న విశ్లేషణ
భారత్ చేతిలో మూడో టీ20లో దక్షిణాఫ్రికా జట్టు 48 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంపై భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలంటూ వస్తున్న డిమాండ్లపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా స్పందించాడు. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఒక్క ఓటమికే తమ విధానం మార్చుకోవడం మూర్ఖత్వమే అవుతుందన్నాడు. మొదటి రెండు మ్యాచుల్లో దక్షిణాఫ్రికాను ఏ మాత్రం నిలువరించలేని భారత బౌలర్లు.. విశాఖ వేదికగా జరిగిన మూడో మ్యచ్ లో మాత్రం పూర్తి సత్తా చాటారు. ఫలితమే భారత్ జయకేతనం. 

‘‘మొదటి రెండు ఓవర్లు పరిశీలించాం. ఆ తర్వాత ఇన్నింగ్స్ లో కదలిక వచ్చింది. కానీ, వారి (భారత) స్పిన్నర్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. మొదటి రెండు మ్యాచుల్లో ఒత్తిడిని తట్టుకుని తిప్పికొట్టినట్టుగా.. మూడో మ్యాచులో చేయలేకపోయాం. పరిస్థితులను భారత స్పిన్నర్లు అనుకూలంగా మలుచుకున్నారు. వారు చక్కగా బౌల్ చేశారు. స్పిన్నర్లను వారి కెప్టెన్ ముందుగా రంగంలోకి దింపాడు. దాంతో మాతో పోలిస్తే పెద్ద మార్పు కనిపించింది. కానీ మా వైపు స్పిన్నర్లతో బౌల్ చేయించడం ఆలస్యం అయింది. ఇదే తేడా’’ అని తమ ఓటమికి దారితీసిన పరిస్థితులను బవుమా వివరించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, వంటి స్టార్ ఆటగాళ్లు భారత్ వైపు లేకపోయినప్పటికీ.. అదేమీ జట్టును బలహీనంగా మార్చదని బవుమా అభిప్రాయపడ్డాడు.


More Telugu News