అది అజిత్ పవార్ ఒక్కరికే కాదు.. మహారాష్ట్రకే అవమానం: సుప్రియా సూలే

  • దెహూలో తుకారం మహారాజ్ ఆలయాన్ని ప్రారంభించిన మోదీ
  • ఫడ్నవీస్‌కు అవకాశం ఇచ్చి అజిత్ పవార్‌కు మాట్లాడే చాన్స్ ఇవ్వని వైనం
  • ఇది దారుణమైన విషయమన్న సుప్రియా సూలే
మహారాష్ట్రలో నిన్న పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూణె జిల్లాలోని దెహూలో తుకారం మహారాజ్ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను, బీజేపీ నేత ఫడ్నవీస్‌ను మాట్లాడేందుకు అనుమతించి.. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను అనుమతించకపోవడం రాజకీయ రచ్చకు కారణమైంది. ప్రతిపక్ష నేతకు అవకాశం ఇచ్చి, ఉప ముఖ్యమంత్రే కాకుండా పూణె జిల్లాకు చెందిన మంత్రి అజిత్ పవార్‌ను మాట్లాడనివ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఇదే విషయమై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూడా స్పందించారు. ఇది అజిత్ పవార్‌ ఒక్కరికే జరిగిన అవమానం కాదని, యావత్ మహారాష్ట్రకు జరిగిన అవమానమని అన్నారు. అమరావతిలోని అంబాదేవి ఆలయాన్ని నిన్న సందర్శించిన సుప్రియ.. అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని సమక్షంలో మాట్లాడేందుకు అనుమతివ్వాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని (పీఎంవో) అజిత్ పవార్ కోరినా అంగీకరించలేదన్నారు. పూణె జిల్లాకు చెందిన అజిత్‌ను అదే జిల్లాలో వేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ విషయంలో అది వారి ఇష్టమని, కానీ అజిత్ పవార్ విషయంలో అలా చేయడాన్ని సమర్థించలేమని సుప్రియా సూలే అన్నారు.


More Telugu News