వైజాగ్ లో టీమిండియా జయభేరి... దక్షిణాఫ్రికా ఓటమి

  • వైజాగ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్
  • టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 రన్స్ చేసిన టీమిండియా
  • లక్ష్యఛేదనలో విఫలమైన సఫారీలు
  • 19.1 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్
వరుసగా రెండు టీ20 మ్యాచ్ ల్లో ఓడి, తీవ్ర ఒత్తిడికి గురైన టీమిండియాకు వైజాగ్ లో ఉపశమనం లభించింది. దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్ రేసులో నిలిచింది. 180 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన సఫారీలను టీమిండియా బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. దక్షిణాఫ్రికా జట్టు 19.1 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆ జట్టులో హెన్రిచ్ క్లాసెన్ 29 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 23, డ్వేన్ ప్రిటోరియస్ 20 పరుగులు చేశారు. విధ్వంసక బ్యాటింగ్ కు మారుపేరుగా నిలిచే వాన్ డర్ డుసెన్ ఈ మ్యాచ్ లో 1 పరుగుకే అవుట్ కావడం దక్షిణాఫ్రికా జట్టుపై ప్రభావం చూపింది. టీమిండియా బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లతో సత్తా చాటగా, చహల్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 1 వికెట్, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో టీమిండియా 1-2తో సిరీస్ రేసులో నిలిచింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఈ నెల 17న రాజ్ కోట్ లో జరగనుంది.


More Telugu News