మధ్యప్రదేశ్ లో అసాధారణ రీతిలో ఉన్న డైనోసార్ గుడ్లు లభ్యం

  • ధార్ జిల్లాలో తవ్వకాలు
  • పరిశోధన చేపట్టిన ఢిల్లీ వర్సిటీ బృందం
  • 10 డైనోసార్ గుడ్లు లభ్యం
  • ఒక గుడ్డులోనే మరొక గుడ్డు ఏర్పడిన వైనం
లక్షల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించి, ప్రతికూల వాతావరణం కారణంగా అంతరించిపోయిన జీవజాతి డైనోసార్ జాతి. ప్రపంచవ్యాప్తంగా వీటి అవశేషాలు ఇప్పటికీ శిలాజ రూపంలో బయల్పడుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోనూ ఈ రాక్షసబల్లుల గుడ్లను గుర్తించారు. అయితే, ఇప్పటివరకు లభ్యమైన గుడ్లతో పోల్చితే ఎంతో భిన్నంగా ఉండడం పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలోని డైనోసార్ ఫోసిల్ నేషనల్ పార్క్ లో తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు 10 డైనోసార్ గుడ్లను వెలికితీశారు. అవన్నీ అసాధారణరీతిలో ఉన్నట్టు గమనించారు. ఇవన్నీ సారోపోడ్ వర్గానికి చెందిన టిటానోసారస్ అనే డైనోసార్ జాతికి చెందినవిగా గుర్తించారు. 

ముఖ్యంగా, ఒక గుడ్డులోనే మరొక గుడ్డు ఏర్పడి ఉండడం పరిశోధకులను విస్మయానికి గురిచేసింది. దీన్ని శాస్త్ర పరిభాషలో 'ఓవమ్ ఇన్ ఓవో' అంటారు. అంటే 'బహుళ కర్పరాలు కలిగిన గుడ్లు' అని అర్థం. గుడ్డులోనే గుడ్డు ఉండడం అనేది పక్షుల్లో అధికంగా కనిపిస్తుందని, దాని ప్రకారం టిటానోసారస్ డైనోసార్లకు పక్షులకు మధ్య దగ్గరి సంబంధం ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పక్షుల మాదిరే ఇవి కూడా వరుసగా గుడ్లు పెట్టే లక్షణాన్ని కలిగివుండేవన్న విషయం అర్థమవుతోందని పేర్కొన్నారు. 

మధ్యప్రదేశ్ లో ఈ తరహా డైనోసార్ గుడ్లు లభ్యం కావడం సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్ లో ప్రచురితమైంది. కాగా, ధార్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో 52 టిటానోసారస్ సారోపోడ్స్ డైనోసార్ గూళ్లను కనుగొన్నారు. ఈ జాతికి చెందిన డైనోసార్లు పక్షుల మాదిరే గూళ్లు కట్టుకునేవని, గుడ్లు పెట్టి, పిల్లలను పొదిగి పెద్ద చేసేంతవరకు ఎంతో శ్రద్ధ తీసుకునేవని పరిశోధకులు వివరించారు.


More Telugu News