'ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్ర‌న్న భ‌రోసా' పేరిట‌ రేప‌టి నుంచి చంద్ర‌బాబు జిల్లాల ప‌ర్య‌ట‌న‌

  • ప్ర‌తి జిల్లాలో 3 రోజుల పాటు చంద్ర‌బాబు టూర్‌
  • తొలి రోజు మ‌హానాడు స‌భ నిర్వ‌హ‌ణ‌
  • రెండో రోజు పార్టీ శ్రేణుల‌తో ఆత్మీయ స‌మావేశాలు
  • మూడో రోజు బాదుడే బాదుడు రోడ్ షోలు
  • ఏడాది పాటు 100 అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాల ప‌ర్య‌ట‌న రేప‌టి నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్ర‌న్న భ‌రోసా పేరిట కొన‌సాగనున్న చంద్ర‌బాబు జిల్లా ప‌ర్య‌ట‌న‌లు బుధ‌వారం అన‌కాప‌ల్లి జిల్లా చోడ‌వరంలో జ‌ర‌గ‌నున్న తొలి మ‌హానాడుతో ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా ప‌ర్య‌ట‌న‌ల్లో జిల్లాల్లో మ‌హానాడుల‌ను నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే పార్టీ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ మహానాడుల్లో చంద్ర‌బాబు స్వ‌యంగా పాలుపంచుకోనున్నారు. 

వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ చంద్రబాబు జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు కొన‌సాగ‌నున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం విధ్వంస‌క‌ర పాల‌న సాగిస్తోంద‌ని, ఈ పాల‌న నుంచి ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తుకు భ‌రోసా ఇచ్చేలా చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లు సాగ‌నున్నాయ‌ని టీడీపీ ప్ర‌క‌టించింది. 

ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌తి జిల్లాల్లో చంద్ర‌బాబు మూడు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో తొలి రోజు మ‌హానాడు, రెండో రోజు పార్ల‌మెంటు ప‌రిధిలోని నేత‌లు, కార్య‌కర్త‌ల‌తో ఆత్మీయ స‌మావేశం, మూడో రోజు ప్ర‌జా స‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వ బాదుడే బాదుడుపై రోడ్ షోలు నిర్వ‌హించనున్నారు. ఇలా ఏడాది పాటు చంద్రబాబు వంద‌కు పైగా అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.


More Telugu News