అనంతబాబుకు బెయిలొస్తే.. సామూహిక ఆత్మహత్యే: హతుడు సుబ్రహ్మణ్యం తల్లి

  • కోర్టు విచారణకు హాజరైన సుబ్రహ్మణ్యం తల్లి
  • అనంతబాబు బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఆందోళన
  • ఆయనకు ఉన్న నేరచరిత్రను బట్టి బాధిత కుటుంబానికి ప్రాణహాని ఉందన్న ఆమె తరపు న్యాయవాది
దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది. అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో ఉన్నారు. నిన్న కోర్టు విచారణకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అనంతబాబుకు కనుక బెయిలు వస్తే తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆయన బయటకు వస్తే అధికార పార్టీ అండతో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. నూకరత్నం తరపు న్యాయవాది, రాష్ట్ర మానవహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ.. అనంతబాబుకు గతంలో నేరచరిత్ర ఉందని, కాబట్టి బాధిత కుటుంబానికి ఆయన నుంచి ప్రాణహాని ఉందని అన్నారు. ఆయన పెట్టుకున్న బెయిలు దరఖాస్తును తిరస్కరించాలని కోరుతూ బాధిత కుటుంబం తరపున తాను వేసిన కౌంటర్ ఫైలును కోర్టు స్వీకరించిందన్నారు.


More Telugu News