ఏడు జన్మలు కాదు.. ఏడు సెకన్లు కూడా మాకొద్దు: భార్యలకు వ్యతిరేకంగా భర్తల 'వట సావిత్రి పూర్ణిమ వ్రతం'

  • మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఘటన
  • ఏడు క్షణాలు కూడా ఈ భార్యలు తమకొద్దంటూ వ్రతం
  • పీపల్ చెట్టుకు దారం చుట్టి ప్రతిజ్ఞ
  • పురుషుల సాధికారతకు కూడా చట్టాలు అవసరమన్న భార్యాబాధితులు
ఈ భార్యలతో మేం వేగలేం, ఏడు జన్మలు కాదు కదా.. ఏడు క్షణాలు కూడా వారిని మేం భరించలేం, వారు మాకొద్దు.. అంటూ భార్యాబాధితులు కొందరు వట సావిత్రి పూర్ణిమ వ్రతం చేశారు. సాధారణంగా ఈ వ్రతాన్ని హిందూ మహిళలు ఆచరిస్తారు. ఏడేడు జన్మలకు ఒక్కరే తన భర్తగా రావాలని కోరుతూ ఈ వ్రతాన్ని చేసుకుంటారు. సావిత్రి తన భర్త సత్యవంతుడిని యమధర్మరాజు నుంచి రక్షించుకుంది. ఈ నేపథ్యంలో తమ భర్తలు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఏడేడు జన్మలకు వారే తమ భర్తలుగా ఉండాలని కోరుకుంటూ పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. 

పౌర్ణమి పురస్కరించుకుని నిన్న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని వలూజ్‌లో భార్యాబాధిత వ్యక్తి ఆశ్రమంలో భార్యాబాధితులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారందరూ కలిసి వట సావిత్రి వ్రతాన్ని నిర్వహించారు. ఈ భార్యలు తమకు ఏడేడు జన్మలు కాదని, ఏడు క్షణాలు కూడా తమకొద్దంటూ పీపల్ చెట్టుకు పూజలు చేసి దారాలు కట్టారు. ఈ వింత పూజకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ సందర్భంగా భార్యాబాధిత సంఘానికి చెందిన పూజారి భరత్ ఫులారి మాట్లాడుతూ.. కొందరు మహిళలకు పీపల్ చెట్టును పూజించే అర్హత లేదన్నారు. తమకు అనుకూలంగా చట్టాలు ఉండడంతో కొందరు మహిళలు భర్తలను వేధిస్తున్నారని, వారి కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఏకపక్ష చట్టం పురుషులను స్త్రీలకు బానిసలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులకు కూడా సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.


More Telugu News