దేశంలో స్వల్పంగా తగ్గిన చిల్లర ద్రవ్యోల్బణం రేటు

  • ఏప్రిల్ లో 7.79 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం
  • మే నెలలో 7.04 శాతానికి తగ్గుదల
  • రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నేతృత్వంలో కమిటీ
భారత్ లో చిల్లర ద్రవ్యోల్బణం రేటు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వినియోగదారుల కొనుగోలు సూచీ (సీపీఐ) ప్రకారం... ఏప్రిల్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతం నమోదు కాగా, మే నెలలో 7.04 శాతానికి తగ్గింది. ఏప్రిల్ నెలలో చిల్లర ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠానికి పెరిగింది. ఇప్పుడు కొద్దిమేర తగ్గినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గరిష్ఠ సహనస్థాయి 6 శాతం కంటే పైనే ఉంది. గత ఐదు నెలలుగా రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం కంటే అధికంగా నమోదవుతోంది. 

ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)ని ఏర్పాటు చేసింది. చిల్లర ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తీసుకురావడం ఈ కమిటీకి కేంద్రం నిర్దేశించిన ప్రధాన లక్ష్యం. ఈ కమిటీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నేతృత్వంలో పనిచేస్తుంది. దేశంలో పెరిగిపోతున్న ధరలను నియంత్రించేందుకు, అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం గత నెలలో దిద్దుబాటు చర్యలకు దిగింది. నిత్యావసరాలపై మోపిన పన్నుల విధానంలో మార్పులను ప్రతిపాదించింది. 

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ దీనిపై స్పందిస్తూ... రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణానికి దారితీసిందని అభిప్రాయపడ్డారు. ఇది అనేక సవాళ్లకు కారణమవుతుండడమే కాకుండా, వస్తు సరఫరా గొలుసుకు అడ్డంకులు కల్పిస్తోందని వివరించారు. తద్వారా ప్రపంచదేశాల్లో ఆహారం, ఇంధనం, ఇతర నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోతున్నాయని విశ్లేషించారు. అనేక దేశాల్లో దశాబ్దకాలం గరిష్ఠానికి ద్రవ్యోల్బణం ఎగబాకిందని శక్తికాంత దాస్ వెల్లడించారు.


More Telugu News