8 గంట‌లుగా రాహుల్ గాంధీని విచారిస్తున్న ఈడీ... ఏఐసీసీ కార్యాల‌యం వ‌ద్ద హైటెన్ష‌న్‌

  • 8 గంట‌ల‌కు పైగా కొన‌సాగుతున్న రాహుల్ విచార‌ణ‌
  • ఏఐసీసీ కార్యాల‌యానికి చేరుకుంటున్న పార్టీ నేత‌లు
  • రాహుల్‌ను అరెస్ట్ చేస్తే ప‌రిస్థితి ఏమిట‌న్న దిశ‌గా ఆందోళ‌న‌
  • పీఎంఎల్ఏ సెక్ష‌న్ 50 కింద రాహుల్ వాంగ్మూలాన్ని న‌మోదు చేస్తున్న ఈడీ
నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు 8 గంట‌లుగా విచారిస్తున్నారు. సోమ‌వారం ఉద‌యం ఈడీ కార్యాల‌యానికి వెళ్లిన రాహుల్‌ను 3 గంట‌ల పాటు విచారించిన ఈడీ అధికారులు మ‌ధ్యాహ్నం భోజ‌నం కోసం రాహుల్ ఇంటికి వెళ్లి వ‌చ్చేందుకు అనుమ‌తించారు. భోజ‌నం త‌ర్వాత తిరిగి ఈడీ కార్యాల‌యానికి వ‌చ్చిన రాహుల్‌ను 5 గంట‌ల‌కు పైగా అధికారులు విచారిస్తూనే ఉన్నారు. పీఎంఎల్ఏ సెక్ష‌న్ 50 కింద ఈడీ అధికారులు రాహుల్ వ‌ద్ద వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. 

ఈ క్ర‌మంలో రాత్రి 8.30 గంట‌లు దాటుతున్నా రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారిస్తుండ‌టంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న నెల‌కొంది. పార్టీకి చెందిన సీనియ‌ర్లు వ‌రుస‌గా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యానికి చేరుకుంటున్నారు. రాహుల్ గాంధీని ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే ప‌రిస్థితి ఏమిట‌న్న దిశ‌గా నేత‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అదే జ‌రిగితే.. అనుసరించాల్సిన వ్యూహంపైనా పార్టీ సీనియ‌ర్లు స‌మాలోచ‌న చేస్తున్నారు. వెర‌సి ఏఐసీసీ కార్యాల‌యం వ‌ద్ద హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.


More Telugu News