మేజర్ ఓ సినిమా కాదు... నిజానికది ఓ భావోద్వేగం: చిరంజీవి

  • మేజర్ చిత్రంపై అభిప్రాయాలను పంచుకున్న చిరంజీవి
  • హృద్యమైన రీతిలో తెరకెక్కించారని కితాబు
  • మహేశ్ బాబుకు అభినందనలు
  • కృతజ్ఞతలు తెలిపిన మహేశ్ బాబు
ఉగ్రవాదులపై పోరాడుతూ వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాలను పంచుకున్నారు. మేజర్ ఓ చిత్రం కాదని, నిజానికది ఓ భావోద్వేగం అని అభివర్ణించారు. జాతి గర్వించదగ్గ గొప్ప హీరో, అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథను ఎంతో హృద్యంగా తెరకెక్కించారని, ఇది తప్పక చూడాల్సిన చిత్రమని చిరంజీవి పేర్కొన్నారు. 

ఇలాంటి ప్రయోజనకరమైన చిత్రానికి మహేశ్ బాబు వెన్నుదన్నుగా వ్యవహరించడం పట్ల గర్విస్తున్నానని తెలిపారు. ఈ చిత్రంలో నటించిన అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళకు, చిత్ర దర్శకుడు శశికిరణ్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా, మేజర్ చిత్రబృందం తనను కలిసినప్పటి ఫొటోలను కూడా చిరంజీవి పంచుకున్నారు.

కాగా, చిరంజీవి స్పందన పట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. 'థాంక్యూ చిరంజీవి సర్' అంటూ వినమ్రంగా బదులిచ్చారు. "మీ స్పందనతో మేజర్ టీమ్ చందమామపై విహరించినంతగా సంబరపడిపోతుంది" అని పేర్కొన్నారు.


More Telugu News