రాహుల్ గాంధీ అంటే ఏమిటో చెప్పిన ప్రియాంకా గాంధీ!

  • ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన రాహుల్ గాంధీ
  • రాహుల్‌తో పాద‌యాత్ర‌గా ఈడీ కార్యాల‌యానికి ప్రియాంకా గాంధీ
  • ఆదిలోనే అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌కు త‌ర‌లించిన పోలీసులు
  • పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ ప్రియాంక
  • సోద‌రుడు రాహుల్ ధైర్యాన్ని కీర్తిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు
నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల వ్య‌వ‌హారంలో మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌పై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీల‌పై కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో విచార‌ణ‌కు రావాలంటూ ఇప్ప‌టికే సోనియా స‌హా రాహుల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయగా...సోమ‌వారం ఉద‌యం రాహుల్ గాంధీ ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. 

ఈ సందర్భంగా సోద‌రుడి వెంట ప్రియాంకా గాంధీ పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేర‌గా...పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేత‌ల‌ను ఆ పార్టీ కార్యాల‌యానికే త‌ర‌లించిన పోలీసులు... రాహుల్ గాంధీని మాత్రం పోలీసు వాహ‌నంలోనే ఈడీ కార్యాల‌యానికి త‌ర‌లించారు.

ఈ సంద‌ర్భంగా ఈడీ అధికారులు, పోలీసుల తీరుపై ప్రియాంకా గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా త‌న సోద‌రుడు రాహుల్ గాంధీ అంటే ఏమిట‌న్న విష‌యాన్ని కూడా ఆమె ఆస‌క్తిక‌రంగా చెప్పారు. దేనికీ త‌లొగ్గ‌ని స‌త్యాన్నే రాహుల్ గాంధీ అంటారంటూ ఆమె వ్యాఖ్యానించారు. పోలీసు బారికేడ్లు, ఈడీ బెదిరింపులు, లాఠీలు, నీటి ఫిరంగులు... ఇలా దేనికీ రాహుల్ గాంధీ త‌లొగ్గ‌ర‌ని ఆమె చెప్పారు.


More Telugu News