అడివి శేష్ కు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కానుక

  • ఇటీవల విడుదలైన మేజర్ చిత్రం
  • నీరాజనాలు పడుతున్న ప్రేక్షకులు
  • స్ఫూర్తిదాయక చిత్రంగా విమర్శకుల ప్రశంసలు
  • మహా సీఎంను కలిసిన మేజర్ టీమ్
ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి స్ఫూర్తిని తట్టిలేపుతున్న చిత్రం మేజర్. సైనిక వీరుల త్యాగనిరతికి నిదర్శనంగా నిలిచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. నాడు ముంబయి మారణహోమంలో సందీప్ ఉన్నికృష్ణన్ వీరమరణం పొందారు. ఇప్పుడాయన కథతో వచ్చిన మేజర్ చిత్రానికి దేశవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంలో తెలుగు నటుడు అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర పోషించారు. 

ఈ నేపథ్యంలో, అడివి శేష్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అభినందించారు. ముంబయిలో ఇవాళ మేజర్ టీమ్ సీఎం ఉద్ధవ్ థాకరేను కలిసింది. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరే చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. దేశం గర్వించే సినిమా తీశారంటూ అడివి శేష్ ను కొనియాడారు. ఈ మేరకు అడివి శేష్ కు ఫొటోలతో కూడిన ఓ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. 

కాగా, భారత సైనిక దళాల్లో ప్రవేశం (సీడీఏ, ఎన్ డీ ఏ) కోసం ఉత్సాహం చూపే వారికి సాయపడేందుకు సందీప్ ఉన్నికృష్ణన్ పేరిట నిధిని ఏర్పాటు చేయడంపై అడివి శేష్ సీఎం ఉద్ధవ్ థాకరేతో మాట్లాడారు. ఇది మంచి ఆలోచన అని అభినందించిన ఆయన, ఈ నిధికి తనవంతు తప్పకుండా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.


More Telugu News