ఒమిక్రాన్ కు సబ్ వేరియంట్లు... తక్కువ అంచనా వేయొద్దంటున్న నిపుణులు

  • మే నెలలో శాంపిళ్ల సేకరణ
  • ఒమిక్రాన్ బీఏ4, బీఏ5 సబ్ వేరియంట్ల గుర్తింపు
  • వేగంగా వ్యాపిస్తాయంటున్న రష్యన్ శాస్త్రవేత్తలు
  • వ్యాక్సిన్లు వేయని దేశాలు అప్రమత్తంగా ఉండాలన్న డబ్ల్యూహెచ్ఓ
గత రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని అస్తవ్యస్తంగా మార్చిన కరోనా మహమ్మారి అనేక విధాలుగా రూపాంతరం చెందుతోంది. కొన్నినెలల కిందట ఒమిక్రాన్ రూపంలోనూ విజృంభించింది. అయితే, రష్యన్ శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కు సబ్ వేరియంట్లు ఉన్నట్టు గుర్తించారు. వీటిని ఒమిక్రాన్ బీఏ4, బీఏ5గా పేర్కొంటున్నారు. 

కరోనా ప్రధాన వేరియంట్ తో పోల్చితే ఇవి చాలా శక్తిమంతమైనవని, వేగంగా వ్యాపించే సామర్థ్యం ఎక్కువని రష్యాలోని రోస్పోట్రెబ్ నడ్జోర్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎపిడెమాలజీ హెడ్ కమిల్ ఖఫిజోవ్ తెలిపారు. వ్యాక్సిన్లు తీసుకోని వారిపై ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ఇంకా వ్యాక్సిన్లు వేయని దేశాలు అప్రమత్తంగా ఉండాలని అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా స్పష్టం చేసింది. 

కాగా, ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను మే నెలలో సేకరించిన శాంపిళ్లలో గుర్తించారు. భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ వల్లే థర్డ్ వేవ్ సంభవించడం తెలిసిందే. అయితే భారత్ లో అత్యధిక శాతం ప్రజలు వ్యాక్సిన్లు పొందడంతో సెకండ్ వేవ్ తో పోల్చితే ఏమంత ప్రాణనష్టం జరగలేదు.


More Telugu News