39 గంటల నుంచి బోరుబావిలోనే బాలుడు.. రంగంలోకి రోబోటిక్ టీమ్ 

  • శుక్రవారం సాయంత్రం బోరుబావిలో పడిపోయిన బాలుడు
  • గుజరాత్ నుంచి వచ్చిన రోబోటిక్ టీమ్
  • క్రేన్ల సాయంతో సమాంతరంగా పెద్ద గుంత
  • ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష
చత్తీస్ గఢ్ లోని ‘జాంజ్ గిర్ - చంపా’ జిల్లాలో 80 అడుగుల లోతు బోరు బావిలో పడిపోయిన 11 ఏళ్ల బాలుడు రాహుల్ ను కాపాడేందుకు గుజరాత్ కు చెందిన రోబోటిక్ టీమ్ రంగంలోకి దిగింది. మాట్లాడలేని, వినలేని సదరు బాలుడు శుక్రవారం సాయంత్రం బోరుబావిలో పడిపోయాడు. ఇప్పటికి 39 గంటలు గడిచిపోయాయి. బాలుడ్ని కాపాడేందుకు రోబోటిక్ టీమ్ తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. 

ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన సూరత్ కు చెందిన రోబోల బృందానికి తగిన సూచనలు చేసినట్టు చత్తీస్ గఢ్ సీఎం బూపేష్ బాఘల్ తెలిపారు. గుజరాత్ కు చెందిన మహేష్ అహిర్ తన బోరుబావి రెస్క్యూ రోబో ఆవిష్కరణను ట్వీట్ చేశాడని, అతడు రాహుల్ ను కాపాడగలడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చిన్నారిని రక్షించేందుకు అతడి సాయాన్ని తీసుకుంటున్నట్టు చెప్పారు. 

బోరు బావికి సమాంతరంగా క్రేన్ల సాయంతో మట్టిని తోడి పోస్తున్నారు. ఈ క్రమంలో ఒక గట్టి రాయి తగిలింది. దాన్ని పగలగొట్టడం కూడా వారికి సవాలుగా మారింది. రాళ్లను బద్దలు కొట్టే మెషినరీని తీసుకొచ్చారు. బాలుడిని కాపాడేందుకు మరో 10 నుంచి 15 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా దీన్ని సమీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రక్షణ లేకుండా వదిలేసిన అన్ని బోర్ వెల్స్ ను మూసివేయాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. జాతీయ విపత్తు సహాయక దళం,రాష్ట్ర విపత్తు సహాయక దళం, వందలాది పోలీసులు ప్రమాద స్థలంలో సేవలు అందిస్తున్నారు. 


More Telugu News