భారత్ మార్గంలోనే శ్రీలంక.. రష్యా చమురు వైపు చూపు

  • ఇతర మార్గాలను ముందుగా పరిశీలిస్తామన్న శ్రీలంక పధాని
  • ఫలితం లేకపోతే రష్యాను ఆశ్రయిస్తామని ప్రకటన
  • చైనా నుంచి మరింత సాయానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టీకరణ
రష్యా నుంచి అదనపు చమురు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పారు. దీనికంటే ముందు తాము ఇతర ప్రత్యామ్నాయాలు చూస్తామన్నారు. ఉక్రెయిన్ పై యుద్ధానికి ప్రతీకారంగా.. పాశ్చాత్య దేశాలు రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవాలని నిర్ణయించడం తెలిసిందే. అయినా కానీ, భారత్, చైనా రష్యా నుంచి చమురును తగ్గించుకోకపోగా, మరింత పెంచుకున్నాయి. 

చైనా నుంచి మరింత ఆర్థిక సాయాన్ని తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని విక్రమసింఘే ప్రకటించారు. భారత్ నుంచి ఇప్పటికే శ్రీలంక కొంత ఆర్థిక సాయాన్ని పొందడం తెలిసిందే. శ్రీలంకకు సాయం చేసే విషయంలో భారత్ చొరవను సైతం చైనా ప్రశంసించింది. శ్రీలంక ప్రస్తుత పరిస్థితిని స్వయంగా కొనితెచ్చుకున్నదేనని విక్రమసింఘే ప్రకటించారు. ఉక్రెయిన్ పై యుద్ధం ఈ సంక్షోభాన్ని మరింత పెంచిందన్నారు.

2024 వరకు ఆహార కొతర కొనసాగొచ్చని విక్రమసింఘే చెప్పారు. తమ దేశానికి గోధుమలను సరఫరా చేస్తామని రష్యా ఆఫర్ చేసినట్టు తెలిపారు. శ్రీలంక 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణ భారాన్ని మోస్తోంది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అయిపోవడంతో కనీస అవసరాలను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇతర మార్గాల ద్వారా తమకు తగినంత ఆయిల్ లభించకపోతే తప్పనిసరిగా రష్యాను ఆశ్రయిస్తామని విక్రమసింఘే స్పష్టం చేశారు.


More Telugu News