ఇల్లు ఖాళీ చేయండి.. బుల్డోజర్ వస్తుంది.. యూపీలో అల్లర్ల సూత్రధారికి నోటీసు

  • ప్రయాగ్ రాజ్ అల్లర్ల సూత్రధారి జావెద్ కు షాక్ ఇచ్చిన ప్రభుత్వం
  • ఇంటిని అక్రమంగా నిర్మించుకున్నట్టు నోటీసు జారీ
  • శనివారం ఉదయానికి ఇల్లు ఖాళీ చేయాలని డిమాండ్
మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన, అల్లర్లకు పాల్పడడం తెలిసిందే. దీని వెనుక ప్రధాన సూత్రధారి అయిన మహమ్మద్ జావెద్ అలియాస్ జావెద్ పంప్ కు కళ్లెం వేసే చర్యలు మొదలయ్యాయి. అతడికి ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ నోటీసు జారీ చేసింది.

శుక్రవారం పట్టణంలో జరిగిన అల్లర్ల వెనుక అతడి ప్రధాన పాత్ర ఉన్నట్టు పోలీసులు ఇప్పటికే తేల్చారు. దీంతో ప్రయాగ్ రాజ్ పట్టణ అభివృద్ధి మండలి నోటీసులు జారీ చేయడం గమనార్హం. పట్టణంలోని అతల ప్రాంతంలో జావెద్ ఇంటి గేటుకు అధికారులు నోటీసు అంటించి వెళ్లారు. శనివారం ఉదయం 11 గంటల వరకు ఇల్లు ఖాళీ చేయాలని అందులో ఉంది.

ఇంటిని అక్రమంగా నిర్మించినట్టు.. ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని నోటీసులో ఉంది. దీంతో పలు చట్ట నిబంధనలను ఉల్లంఘింనట్టు తేల్చింది. ఈ ఏడాది మే5న జారీ చేసిన షోకాజు నోటీసుకు జావెద్ నుంచి ఎటువంటి స్పందన లేదని, ఇంటిని ఖాళీ చేయలేదని ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ పేర్కొంది. దీంతో జూన్ 9న మరో నోటీసు జారీ చేస్తున్నట్టు తెలిపింది. 

శుక్రవారం నాటి అల్లర్లకు అతల ప్రాంతం కేంద్రంగా ఉండడం గమనార్హం. అల్లర్లకు జావెద్ పిలుపునిచ్చినట్టు, అవి హింసాత్మక రూపం దాల్చినట్టు పోలీసులు గుర్తించారు. అతడ్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు.


More Telugu News