దేశంలో కొత్త కేసుల పెరుగుదలకు కారణం చెప్పిన నిపుణులు

  • దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు
  • కొత్త వేరియంట్లు ఉనికిలో లేవంటున్న నిపుణులు
  • నిబంధనలు పాటించకపోవడమే కేసుల పెరుగుదలకు కారణం
  • వైరస్ బారినపడిన చాలామందిలో తేలికపాటి అనారోగ్యమే ఉంటుందన్నడాక్టర్ ఎన్‌కే అరోరా
దేశంలో కరోనా వైరస్ మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది. దాని బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, హర్యానాల్లో వెలుగు చూస్తున్న కొత్త కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, కేసులు పెరుగుతున్నాయని భయం అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కొత్త కేసులు కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన కలిగించే కొత్త వేరియంట్‌లేవీ మన దేశంలో వెలుగు చూడలేదని చెబుతున్నారు. కాబట్టి ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం, బూస్టర్ డోసులు తీసుకోకపోవడమే కొత్త ఇన్ఫెక్షన్లకు కారణమని చెబుతున్నారు.

కరోనా బారినపడిన చాలామందిలో సాధారణ జలుబు, తేలికపాటి అనారోగ్యం మాత్రమే కనిపిస్తోందని నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం బీఏ2 వేరియంట్‌తోపాటు బీఏ 4, బీఏ5 వేరియింట్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఒమిక్రాన్, ఇతర సబ్ వేరియంట్లతో పోలిస్తే వీటి వ్యాప్తి కొంచెం ఎక్కువగానే ఉందన్నారు. వేసవి సెలవులు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేత, ఆర్థిక కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కావడంతో ప్రజల కదలికలు పెరిగాయని, ప్రస్తుత కరోనా కేసుల పెరుగుదలకు అదే కారణమని డాక్టర్ ఎన్‌కే అరోరా వివరించారు. ప్రతి ఒక్కరు బూస్టర్ డోసు వేసుకోవడం ద్వారా కరోనాకు దూరంగా ఉండొచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు.


More Telugu News