ఇది అన్యాయపు నిర్ణయం... పెంచిన విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి: రేవంత్ రెడ్డి

  • విద్యార్థుల బస్ పాస్ చార్జీల పెంపు
  • తెలంగాణ ఆర్టీసీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు
  • విద్యార్థుల పాలిట పిడుగుపాటు అన్న రేవంత్
  • మరే రాష్ట్రంలో ఇలా పెంచలేదన్న కోమటిరెడ్డి
తెలంగాణలో విద్యార్థుల బస్ పాస్ నెలవారీ ఛార్జీలను భారీగా పెంచడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. బస్ పాస్ ఛార్జీలను ఊహించని స్థాయిలో పెంచడం విద్యార్థుల పాలిట పిడుగుపాటు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాల నడ్డి విరిచేలా ఉందని, మోయలేని భారంతో విద్యార్థులను చదువుకు దూరం చేసేలా ఉందని విమర్శించారు. ఈ అన్యాయపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

అటు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ... ఛార్జీలను పెంచాలని ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని అన్నారు. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను ఈ రీతిలో భారీగా పెంచడం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని విమర్శించారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని తెలంగాణ ఆర్టీసీ వెంటనే వెనక్కి తీసుకోవాలని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.


More Telugu News