రైతుల్లేని రాష్ట్రంగా ఏపీ మారుతోంది... సీఎం జ‌గ‌న్‌కు లేఖ‌లో నారా లోకేశ్

  • వ్య‌వ‌సాయం ప‌ట్ల వైసీపీ ప్ర‌భుత్వం తీవ్ర నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌న్న లోకేశ్
  • క్రాప్ హాలిడేలు విర‌మించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్‌
  • మూడేళ్ల‌లోనే 50 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట న‌ష్టం జ‌రిగింద‌ని వెల్ల‌డి
ఏపీలో క్రాప్ హాలిడేలు ప్ర‌క‌టిస్తున్న వైనాన్ని ప్ర‌స్తావిస్తూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ శ‌నివారం సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి లేఖ రాశారు. వైసీపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల వ‌ల్ల రైతుల్లేని రాష్ట్రంగా ఏపీ మారిపోతోంద‌ని లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైనా రైతుల‌ను ఆదుకోవాల‌ని... అందులో భాగంగా క్రాప్ హాలిడేలు విర‌మించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని లోకేశ్ కోరారు. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ఏపీలో రైతులు క్రాప్ హాలిడేల బాట ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

వ్య‌వ‌సాయం ప‌ట్ల వైసీపీ ప్ర‌భుత్వం తీవ్ర నిర్ల‌క్ష్యం చూపుతోంద‌ని నారా లోకేశ్ ఆరోపించారు. ప్ర‌భుత్వ వైఖ‌రి కార‌ణంగా గ‌తేడాది క‌ర్నూలు, క‌డ‌ప‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రైతులు క్రాప్ హాలిడేలు ప్ర‌క‌టించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. గ‌తేడాదే రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి ఉంటే... ఈ ఏడాది మ‌రిన్ని ప్రాంతాల్లో క్రాప్ హాలిడే ఉండేది కాద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌గ‌న్ పాల‌న సాగిన ఈ మూడేళ్ల‌లోనే ప్ర‌కృతి వైప‌రీత్యాల కారణంగా రాష్ట్రంలో 50 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట న‌ష్టం జ‌రిగింద‌న్న లోకేశ్... పంట న‌ష్ట‌పోయిన ఒక్క రైతును కూడా ప్ర‌భుత్వం ఆదుకోలేద‌ని మండిప‌డ్డారు.


More Telugu News