ఏపీలో పెత్త‌నమంతా ఆ ఐదుగురు రెడ్ల‌దే: సీపీఐ రామ‌కృష్ణ‌

  • ధ‌ర్మాన‌, బొత్స‌ స‌హా మంత్రులంద‌రూ డ‌మ్మీలేనన్న రామకృష్ణ 
  • మంత్రుల‌కు ఎలాంటి నిర్ణ‌యాధికారాలు లేవని వ్యాఖ్య 
  • హోం మంత్రికి ఎస్సైని బ‌దిలీ చేసే అధికారం కూడా లేదన్న రామ‌కృష్ణ‌
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌, మంత్రుల‌కు అధికారాలు, పెత్త‌నం చెలాయిస్తున్న వారెవ‌ర‌న్న విష‌యంపై సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలోని 26 జిల్లాల్లో కేవ‌లం ఐదుగురు రెడ్లు మాత్రమే పెత్త‌నం చెలాయిస్తున్నారంటూ ఆయ‌న ఆరోపించారు. ఈ మేర‌కు శ‌నివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా రామ‌కృష్ణ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీలో పెత్త‌నం చెలాయిస్తున్న‌ రెడ్ల‌లో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పైన ఉన్నార‌ని రామ‌కృష్ణ వ్యాఖ్యానించారు. ఆ త‌ర్వాత విజ‌య‌సాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిలు.. ఈ ఐదుగురు రెడ్లే రాష్ట్రంలోని 26 జిల్లాల‌ను పాలిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. సీఎం జ‌గ‌న్ రాష్ట్రంలో నియంత పాల‌న సాగిస్తున్నార‌ని కూడా రామ‌కృష్ణ ధ్వ‌జ‌మెత్తారు.

ఇక మంత్రుల అధికారాల విష‌యంపై మాట్లాడుతూ‌... ఏపీలోని ఏ ఒక్క మంత్రికి కూడా అధికారాలు లేవ‌ని తేల్చి పారేశారు. మంత్రులు ధ‌ర్మాన‌తో పాటు బొత్స కూడా డ‌మ్మీనేన‌ని ఆయ‌న చెప్పారు. ధ‌ర్మాన‌, బొత్స‌తో పాటు కేబినెట్‌లోని మంత్రులంతా డ‌మ్మీలేన‌ని ఆయ‌న ఆరోపించారు. హోం మంత్రిగా ఉన్న మ‌హిళా నేత‌కు కనీసం ఎస్సైని బ‌దిలీ చేసే అధికారం కూడా లేద‌ని రామ‌కృష్ణ కీల‌క వ్యాఖ్య చేశారు.


More Telugu News