అదనపు ఫీచర్లతో టెలిగ్రామ్ పెయిడ్ వెర్షన్

  • ఈ నెలాఖరులో విడుదల
  • పెయిడ్ యూజర్లకు ప్రత్యేక ఫీచర్లు
  • ఉచిత వెర్షన్ కూడా కొనసాగుతుందన్న కంపెనీ చీఫ్ దురోవ్
  • ఉచిత వెర్షన్ లో ఇక ముందూ కొత్త ఫీచర్లు
వాట్సాప్ మాదిరే సేవలను అందించే టెలిగ్రామ్ కు యూజర్ల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతోంది. వాట్సాప్ లో లేని ఫీచర్లను కూడా టెలిగ్రామ్ తీసుకొస్తోంది. ఇప్పటి వరకు టెలిగ్రామ్ సేవలు అందరికీ ఉచితమే. కానీ, త్వరలో టెలిగ్రామ్ పెయిడ్ వెర్షన్ (డబ్బులు చెల్లించి వినియోగించుకునే) కూడా రానుంది. ఈ పరిణామాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ధ్రువీకరించారు. 

‘‘ప్రతి ఒక్కరినీ ఎటువంటి పరిమితులు లేకుండా అనుమతిస్తే అప్పుడు మా సర్వర్లు, రద్దీ నిర్వహణకు అయ్యే వ్యయాలు భరించలేనంత పెరిగిపోతాయి. అందుకే అందరికీ అన్నీ ఉచితంగా లభించవు’’ అని దురోవ్ తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న సదుపాయాలను ఉచితంగా అందిస్తూ.. అదనంగా తీసుకొచ్చే కొన్ని కొత్త సదుపాయాలను పెయిడ్ ఆప్షన్ కు పరిమితం చేస్తామని చెప్పారు.

ప్రతి నెలా నిర్ణీత చందా చెల్లించడం ద్వారా టెలిగ్రామ్ పెయిడ్ సేవలు పొందే వీలుంటుంది. టెలిగ్రామ్ క్లబ్ లో చేరి, కొత్తగా వచ్చే ఫీచర్లను ముందుగానే పొందే వెసులుబాటు కూడా ఉంది. ఇప్పుడు ఉన్న ఫీచర్లు అన్నీ ఉచిత చందాదారులకు ఇక ముందు కూడా లభిస్తాయని, అలాగే, కొత్త ఫీచర్లను కూడా అందిస్తామని దురోవ్  తెలిపారు. ఈ నెల చివర్లో టెలిగ్రామ్ పెయిడ్ వెర్షన్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.


More Telugu News