మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో రాంచీలో అల్లర్లు.. ఇద్దరి మృతి.. 12 మందికి గాయాలు

  • వెల్లడించిన రాంచీ సీపీ
  • 8 మంది నిరసనకారులు, నలుగురు పోలీసులకు గాయాలు
  • అల్లర్లకు దూరంగా ఉండాలని ఝార్ఖండ్ సీఎం విజ్ఞప్తి
  • రాష్ట్ర ప్రజలు సహనపరులని కామెంట్
బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ ముస్లింలు చేసిన ఆందోళన హింసాత్మకంగా మారింది. నిన్న ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన అల్లర్లలో నిరసనకారులు రాళ్లు రువ్వారు. చిరు వ్యాపారుల బండ్లను తగులబెట్టారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు. 

అయితే, ఈ ఘటనల్లో ఇద్దరు గన్ షాట్ వల్ల అయిన గాయాలతో చనిపోయారని, మరో 12 మంది గాయపడ్డారని రాంచీ పోలీస్ కమిషనర్ అన్షుమాన్ కుమార్ తెలిపారు. గాయపడిన వాళ్లలో ఎనిమిది మంది నిరసనకారులు, నలుగురు పోలీసులు ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని, సిటీలో ఆంక్షలను విధించామని తెలిపారు. రేపటి వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపేశామని జిల్లా అధికారులు ప్రకటించారు. 

ఘటనపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. తనకు చాలా సడన్ గా ఈ విషయం తెలిసిందన్నారు. ఝార్ఖండ్ ప్రజలు సున్నిత మనస్కులని, సహనపరులని అన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి అల్లర్లకు ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సామరస్యం కోసం పాటుపడాలన్నారు.


More Telugu News