ఈ మంత్రి చాలా నిదానం... ఒక్క పేజీ రాయడానికి రెండు గంటల సమయం తీసుకుంటున్నాడు: కోర్టుతో మొరపెట్టుకున్న ఈడీ

  • అవినీతి ఆరోపణలపై ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్
  • కస్టడీ పొడిగించాలన్న ఈడీ
  • స్టేట్ మెంట్ ను ఆయనే స్వయంగా రాయాల్సి ఉందని వివరణ
  • సోమవారం వరకు కస్టడీ పొడిగించిన కోర్టు
అవినీతి ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ పై ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఆసక్తికర ఆరోపణలు చేసింది. మంత్రి సత్యేంద్ర జైన్ చాలా నిదానంగా రాస్తుంటారని, ఒక్క పేజీ ప్రకటన రాయడానికి రెండు గంటల సమయం తీసుకున్నారని కోర్టుకు తెలిపింది. అందుకే సత్యేంద్ర జైన్ కస్టడీని మరింత పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. 

కేసు బలంగా ఉండాలంటే సత్యేంద్ర జైన్ ఇచ్చే వాంగ్మూలం ఎంతో కీలకమని, ఆయన స్వయంగా రాసిన వాంగ్మూలం అయితేనే కేసు పటిష్ఠతకు దోహదపడుతుందని ఈడీ అభిప్రాయపడింది. వాంగ్మూలాన్ని స్వయంగా రాయకపోతే, తాను చెప్పిన మాటలను తానే తోసిపుచ్చే అవకాశం ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు పేర్కొన్నారు. 

అయితే ఒక్క పేజీ రాయడానికి రెండు గంటల సమయం తీసుకున్న మంత్రి సత్యేంద్ర జైన్... పూర్తి స్టేట్ మెంట్ రాసేసరికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని, ఆయన కస్టడీని పొడిగించాలని కోరడం వెనుక ఇది కూడా ఓ కారణమని కోర్టుకు నివేదించారు. 

ఈడీ వాదనలన సత్యేంద్ర జైన్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ అంగీకరించలేదు. తన క్లయింటు (సత్యేంద్ర జైన్) ఇప్పటికే కస్టడీలో ఉన్నారని, కస్టడీ పొడిగించాలని ఈడీ కోరడం సహేతుకంగా లేదని సిబాల్ వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు మంత్రి సత్యేంద్ర జైన్ కు సోమవారం వరకు కస్టడీ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. 

కాగా, ఈడీ తాను విచారణ జరిపే కేసుల్లో స్టేట్ మెంట్లను ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతోనే రాయిస్తుందని ప్రచారంలో ఉంది. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ తో ఏకంగా 1,300 పేజీల స్టేట్ మెంట్ రాయించిందట! ఆ లెక్కన ఒక పేజీకి రెండు గంటల సమయం తీసుకునే సత్యేంద్ర జైన్... పూర్తి స్టేట్ మెంట్ లిఖించడానికి ఇంకెంత సమయం తీసుకుంటాడోనని ఈడీ ఆందోళన చెందినట్టు అర్థమవుతోంది.


More Telugu News