ఇవి ఆచరిస్తే.. గుండెకు ఆరోగ్యం  

  • రోజులో ఉప్పు 6 గ్రాములు మించకూడదు
  • ఆల్కహాల్, స్మోకింగ్ పక్కన పెట్టేయాలి
  • వ్యాయామంతో బరువు నియంత్రించుకోవాలి
  • తక్కువ  ఫ్యాట్ ఉన్న పదార్థాలు తీసుకోవాలి
మన దేశంలో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో గుండె జబ్బులు ఒకటి. హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువ నమోదు కావడమే దీనికి నిదర్శనం. ఇలా గుండె జబ్బులు పెరిగిపోవడానికి ప్రధాన కారణాల్లో ఆహార పరమైన మార్పులు, ఒత్తిడులు, నిద్ర తగినంత లేకపోవడం, శారీరక కదలికలు లేకపోవడం కారణాలుగా ఉంటున్నాయి. 

వీటికితోడు చెడు అలవాట్లు కూడా చేటు చేస్తున్నాయి. కనుక వీటి విషయంలో కాస్త శ్రద్ధ వహిస్తే గుండెను ఆరోగ్యంగా చూసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. గుండెకు సరఫరా అయ్యే రక్త ప్రవాహానికి అవరోధాలు ఎదురుకావడం, లేదా పూర్తిగా నిలిచిన సందర్భంలోనే హార్ట్ ఎటాక్ తలెత్తుతుంది. 

ఆహారం
ఉప్పు రోజులో 6 గ్రాములు మించకుండా చూసుకోవాలి. కూరగాయలు, ఇతర సహజ పదార్థాల్లోనూ స్వల్ప పరిమాణంలో సోడియం ఉంటుంది. కనుక బయటి నుంచి తీసుకునే ఉప్పును చాలా పరిమితం చేసుకోవాలి. ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్ అసలే తినొద్దు.

అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు పండ్లు, కూరగాయలు, ముడి ధాన్యాలు (పాలిష్ చేయనివి), ఫ్యాట్, ఉప్పు తక్కువ ఉన్న పదార్థాలకు పరిమితం కావాలి. 

తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోవాలి. చేపలు, నట్స్ తోనూ గుండెకు మంచి జరుగుతుంది. రెడ్ మీట్, స్వీట్లు, షుగర్ కు దూరంగా ఉండాలి. చక్కెర కలిపిన బెవరేజెస్ ను దూరం పెట్టేయాలి. 

వ్యాయామాలు
శారీరకంగా శ్రమించాల్సిన అవసరం లేని ఎన్నో సదుపాయాలు నేడు వచ్చేశాయి. కనుక శరీరానికి వ్యాయామం అన్నది లేకుండా పోయింది. గుండె ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు ముందు చేయాల్సింది వ్యాయామమే. దీనివల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక రక్తపోటు కూడా నియంత్రణలోకి వచ్చేస్తుంది. అధిక బరువు కూడా తగ్గుతారు.

నడవడం, శారీరకంగా శ్రమించడం వల్ల గుండెకు మంచి చేసే కొలెస్ట్రాల్ (హెచ్ డీఎల్) పెరుగుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ప్రభావాన్ని తగ్గించగలదు. ప్రతి రోజూ 4-5 కిలోమీటర్ల మేర వేగంగా నడిచినా మంచి ఫలితం కనిపిస్తుంది. ఏరోబిక్ ఎక్సర్ సైజులతోనూ మంచి ఫలితం ఉంటుంది.

వెయిట్
బరువు నియంత్రణ కూడా చాలా కీలకం. బాడీ మాస్ ఇండెక్స్ 25 నుంచి 30 వరకు ఉంటే అధిక బరువుగా చూడాలి. బీఎంఐ 30కు పైన ఉంటే దాన్ని స్థూలకాయంగా పరిగణిస్తారు. కానీ, రక్తపోటు నియంత్రణలో ఉంచుకుని, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకునే వారు బీఎంఐ 25లోపు ఉండేలా చూసుకోవాలి.

అలవాట్లు..
పొగతాగడాన్ని మానేయాలి. సిగరెట్ తాగడం మానేసిన ఒక్క రోజులోనే బీపీ తగ్గడం మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు. పూర్తిగా మానేస్తే రెండేళ్లలో మంచి ఫలితాలు కనిపిస్తాయట. 

ఆల్కహాల్ ను కూడా వదిలేయాలి. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల రక్తపోటు పెరుగుతుంది. ట్రైగ్లిజరైడ్స్ కూడా పెరుగుతాయి. ప్రాణాయామం, యోగ ద్వారా ఒత్తిడులను దూరం పెట్టుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు తగినంత నిద్ర కూడా అవసరం.


More Telugu News