పబ్ జీ కోసం తల్లిని కాల్చిచంపిన ఘటన.. విచారణలో కళ్లు తేలేసే విషయాలు వెల్లడించిన బాలుడు!

  • తల్లిపై రివాల్వర్ తో కాల్పులు
  • మరుసటి రోజు ఉదయం చూడగా శ్వాస తీసుకుంటున్న తల్లి
  • అయినా ఎవరికీ చెప్పని బాలుడు
  • గంటకోసారి తలుపు తీసి చనిపోయిందా? లేదా అని పరిశీలన
  • విచారణలో పోలీసులకు విషయాల వెల్లడి
పబ్ జీ మొబైల్ గేమ్ ఆడకుండా అడ్డుకున్నందన్న ఆగ్రహంతో తల్లిని రివాల్వర్ తో కాల్చి చంపిన ఘటనలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూశాయి. యూపీలోని లక్నోలో ఐదు రోజుల క్రితం (గత ఆదివారం రాత్రి) 16 ఏళ్ల బాలుడు తన తల్లి సాధన (40)పై కాల్పులు జరపగా, ఆమె ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. మూడు రోజుల తర్వాత తల్లి మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండడంతో అతడు కోల్ కతాలో పనిచేస్తున్న తన తండ్రి, ఆర్మీ ఉద్యోగికి కాల్ చేసి చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. 

పోలీసులు బాలుడిని విచారించగా, అతడు చెప్పిన విషయాలు విని అధికారులకు తల తిరిగినంత పనైంది. నిజానికి బాలుడు తుపాకీతో కాల్పులు జరిపిన వెంటనే సాధన ప్రాణాలు కోల్పోలేదు. గాయాలతో పడిపోయిన ఆమెను అలాగే గదిలో వదిలేసి బాలుడు బయట గడియ పెట్టాడు. తన సోదరిని మరో గదిలో బంధించాడు. మరుసటి రోజు ఉదయం డోర్ తెరిచి చూడగా తల్లి శ్వాస తీసుకోవడం కనిపించింది. తల్లి బతికి ఉందా? చనిపోయిందా? అని తాను తరచూ వెళ్లి తలుపు తీసి చూసినట్టు బాలుడు వెల్లడించాడు. 

కనీసం కాల్పులు జరిపిన మర్నాడు ఉదయం అయినా అతడు విషయాన్ని ఎవరికైనా చెప్పి ఉంటే సాధన బతికి ఉండేదని పోలీసులు అంటున్నారు. పబ్ జీ ఆడనీయనందుకే తండ్రి రివాల్వర్ తో కాల్చానని అతడు చెప్పాడు. అంతేకాదు, మరుసటి రోజు తల్లి మృతదేహాన్ని ఇంటి నుంచి తరలించేందుకు స్నేహితుడి సాయాన్ని కూడా కోరాడు. రూ.5,000 ఇస్తానని ఆఫర్ కూడా చేశాడట. అంతేకాదు, ఈ సంఘటన గురించి ఎవరికీ చెప్పొద్దని స్నేహితుడిని బెదించినట్టు కూడా పోలీసులకు తెలిపాడు. 


More Telugu News