725 పరుగుల తేడాతో విజయం.. ముంబై రంజీ జట్టు ప్రపంచ రికార్డు

  • సెమీ క్వార్టర్స్ లో ఉత్తరాఖండ్ ను చిత్తుగా ఓడించిన ముంబై
  • ప్రపంచంలో ఇంత భారీ ఆధిక్యంతో గెలవడం ఇదే మొదటిది
  • సెమీ ఫైనల్స్ కు దూసుకుపోయిన ముంబై జట్టు
ముంబై రంజీ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. గురువారం ఆలూరులో జరిగిన రంజీ ట్రోఫీ సెకండ్ క్వార్టర్ ఫైనల్లో ఉత్తరాఖండ్ ను 725 పరుగుల తేడాతో ఓడించి సెమీ ఫైనల్స్  బెర్త్ ఖాయం చేసుకుంది. సువేద్ పర్కర్ 252 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 153 పరుగులు సాధించారు. యశస్వి జైస్వాల్ సెంచరీ, షమ్స్ ములాని 5 వికెట్లు తీసి ముంబై జట్టు ఘన విజయంలో పాత్ర పోషించారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక జట్టు ఇంత భారీ స్కోరు తేడాతో విజయం సాధించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ముంబై జట్టు చాలా బలమైనది, పటిష్ఠమైనది అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు 41 రంజీ ట్రోఫీ టైటిల్స్ ను ఈ జట్టు గెలుచుకుంది. దేశవాళీ క్రికెట్ లో మరే జట్టుకూ కూడా ఇంత సక్సెస్ రికార్డు లేదు. 

పృథ్వీషా కెప్టెన్సీలో ముంబై జట్టు తొలి ఇన్సింగ్స్ ను 8 వికెట్ల నష్టానికి 647 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఉత్తరాఖండ్ జట్టును ముంబై బౌలర్ షామ్స్ ములాని గడగడలాడించాడు. ఐదు వికెట్లు తీశాడు. ముంబై బౌలర్లు చెలరేగిపోవడంతో ఉత్తరాఖండ్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ముంబై రెండో ఇన్నింగ్స్ ఆరంభించేందుకు మొగ్గు చూపింది. 

యశస్వి జైస్వాల్ 103 పరుగులు, పృథ్వీ షా 72 పరుగులు చేశారు. మూడో స్థానంలో వచ్చిన ఆదిత్య తరే 57 పరుగులు నమోదు చేశాడు. దీంతో మూడు వికెట్ల నష్టానికి 261 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను ముంబై డిక్లేర్ చేసింది. రెండోసారి బ్యాటింగ్ చేపట్టిన ఉత్తరాఖండ్ 69 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో భారీ విజయం ముంబై సొంతం అయింది. 

ఇంతకుముందు వరకు 1929/30లో క్వీన్స్ లాండ్ పై న్యూసౌత్ వేల్స్ 685 పరుగుల ఆధిక్యంతో గెలిచిందే ప్రపంచ రికార్డుగా ఉంది. ఇప్పుడు ఈ రికార్డు రెండో స్థానానికి పడిపోయింది.


More Telugu News