పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు సూత్రధారి లారెన్స్ బిష్ణోయ్: నిర్ధారించిన పోలీసులు

  • ఇటీవల పంజాబ్ లో మూసేవాలా హత్య
  • తీహార్ జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ని విచారించిన పోలీసులు
  • ఈ హత్య తమ పనే అని అంగీకరించిన బిష్ణోయ్
  • పరారీలో ప్రధాన షూటర్
ఇటీవల పంజాబీ ర్యాప్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య తీవ్ర కలకలం రేపింది. సిద్ధూ మూసేవాలాకు ప్రభుత్వం భద్రత ఉపసంహరించిన మరుసటి రోజే ఈ హత్య జరిగింది. కాగా, ఈ హత్య గ్యాంగ్ వార్ లో భాగంగానే జరిగినట్టు పోలీసులు మొదటి నుంచి అనుమానిస్తున్నారు. 

ఇక ఈ హత్య తమ పనే అంటూ కెనడా వాసి గోల్డీ బ్రార్ (ఇతడు కూడా గ్యాంగ్ స్టర్) ఫేస్ బుక్ లో పోస్టు చేసిన మేరకు పోలీసుల సందేహాలు కొంతమేర బలపడ్డాయి. తీహార్ జైల్లో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ని విచారించే సరికి పోలీసులు ఈ హత్య అతడి ముఠా పనే అని నిర్ధారించారు. 

సిద్ధూ మూసేవాలా హత్యకు ప్రధాన సూత్రధారి లారెన్స్ బిష్ణోయ్ అని స్పెషల్ సెల్ కమిషనర్ హెచ్ఎస్ ధలీవాల్ వెల్లడించారు. లారెన్స్ ముఠా సభ్యులే ఈ హత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు. అయితే, సిద్ధూ మూసేవాలా హత్యలో పాల్గొన్న ప్రధాన షూటర్ ఇంకా దొరకలేదని తెలిపారు. ప్రధాన షూటర్ కు సన్నిహితుడైన సిద్దేశ్ కమ్లేని పూణేలో అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న ఐదుగురు నిందితులను గుర్తించామని వివరించారు.


More Telugu News