నిందితులను అత్యాచార బాధితురాలు గుర్తుపట్టడం లేదని పోలీస్ కమిషనర్ చెప్పడం దేనికి సంకేతం?: దాసోజు శ్రవణ్
- జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసును పక్కదోవ పట్టిస్తున్నారన్న దాసోజు
- ఫొటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇంకేం ఆధారాలు కావాలని ప్రశ్న
- ఎమ్మెల్యే పేరు చెప్పడానికి సీవీ ఆనంద్ భయపడుతున్నారని ఎద్దేవా
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసును పక్కదోవ పట్టిస్తున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. అత్యాచారం కేసును ఏడు రోజులుగా పోలీసులు సాగదీస్తున్నారని చెప్పారు. ఇదే సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురించి మాట్లాడుతూ... ఆయన మాటలను వింటుంటే నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టనిపిస్తోందని అన్నారు. నిందితులను బాధితురాలు గుర్తు పట్టడం లేదని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
నిందితులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చిన తర్వాత... ఇంకా ఏం ఆధారాలు కావాలని దాసోజు శ్రవణ్ అడిగారు. దిశ కేసులో నిందితులను రాత్రికి రాత్రి ఎన్ కౌంటర్ చేశారని... బడాబాబులకు ఒక న్యాయం, పేదోడికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు.
తొలుత కారులో ఎమ్మెల్యే కొడుకు లేడని చెప్పారని... అయితే ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత మధ్యలోనే ఎమ్మెల్యే కొడుకు వెళ్లిపోయాడని అంటున్నారని... ఎమ్మెల్యే పేరు చెప్పడానికి కూడా సీవీ ఆనంద్ భయపడుతున్నారని విమర్శించారు. నిందితులు మందు తాగలేదని పోలీసులు ఎలా చెపుతారని ప్రశ్నించారు. ఏమైనా టెస్టులు చేయించారా? అని అడిగారు. ఇంత దారుణం జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ కనీస సమీక్ష కూడా నిర్వహించలేదని అన్నారు. ట్విట్టర్ లో ప్రతి అంశంపై స్పందించే కేటీఆర్ ఈ ఘటనపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.