ఒకే రోజు 12 మంది మైనారిటీలను ఉరి తీసిన ఇరాన్.. వెల్లడించిన నార్వేలోని హక్కుల సంస్థ

  • 11 మంది పురుషులు, ఒక మహిళకు శిక్ష అమలు
  • డ్రగ్స్, హత్య కేసుల్లో ఉరి తీసిన ఆ దేశ ప్రభుత్వం
  • గత ఏడాది 333 మందికి శిక్ష అమలు
  • అందులో 25 శాతం మైనారిటీలైన బలూచ్ లే
ఇరాన్ ఒకే రోజు 12 మంది మైనారిటీలను ఉరి తీసింది. డ్రగ్స్, హత్యా నేరాలపై జైలు శిక్షను అనుభవిస్తున్న 11 మంది పురుషులు, ఒక మహిళకు నిర్దాక్షిణ్యంగా ఇరాన్ ఉరిశిక్షను అమలు చేసిందని ఇరాన్ హ్యూమన్ రైట్స్ అనే నార్వేకి చెందిన హక్కుల సంస్థ వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కు సరిహద్దులకు సమీపంలోని సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉన్న జహేదాన్ జైలులో ఈ శిక్షలను అమలు చేసినట్టు పేర్కొంది. 

ఉరిశిక్ష అమలైన వాళ్లందరూ బలూచ్  మైనారిటీ తెగలకు చెందిన వారని వెల్లడించింది. అందరూ సున్నీ తెగకు చెందిన వారని తెలిపింది. డ్రగ్స్ అక్రమ రవాణా చేశారని ఆరుగురిని, హత్య కేసుల్లో మరో ఆరుగురిని ఉరి తీసినట్టు పేర్కొంది. అయితే, ఈ శిక్షల అమలు గురంచి ఆ దేశానికి చెందిన మీడియా సంస్థలు గానీ, అధికారులు గానీ ప్రకటన చేయలేదని తెలిపింది. 

తన భర్తను చంపినందుకు గార్గిజ్ అనే మహిళను 2019లో అరెస్ట్ చేశారని, ఇప్పుడు ఉరి తీసి చంపేశారని పేర్కొంది. మైనారిటీలే టార్గెట్ గా ఇరాన్ మరణ శిక్షలను అమలు చేస్తోందంటూ స్వచ్ఛంద కార్యకర్తలు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయవ్యంలో కుర్దులు, నైరుతి ప్రాంతంలో అరబ్బులు, ఆగ్నేయ ప్రాంతంలో బలూచ్ లే లక్ష్యంగా హక్కులను కాలరాస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 

2021లో అమలు చేసిన ఉరి శిక్షల్లో 21 శాతం మంది బాధితులు బలూచ్ లే ఉన్నారని, ఇరాన్ ప్రజలు కేవలం 2–6 శాతమేనని పేర్కొంది. 2021లో 333 మందిని ఉరితీయగా.. 2020తో పోలిస్తే ఆ శిక్షలు 25 శాతం పెరిగాయని తెలిపింది.


More Telugu News