'వాళ్ల తలలు తెగనరికితే నజరానా' అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్.. మళ్లీ రేగిన హిజాబ్ వివాదం!

  • బీజేపీ నేత యశ్ పాల్ సువర్ణ, శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ లకు బెదిరింపులు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • బెదిరింపుల వెనకున్న స్థానికులెవరో తేల్చాలన్న యశ్ పాల్  
సద్దుమణిగిందనుకుంటున్న హిజాబ్ వివాదం.. మరోసారి తీవ్రమైన బెదిరింపుల రూపం తీసుకుంది. హిజాబ్ వివాదం రేగిన కర్ణాటకలోని ఉడుపి పీయూసీ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ సభ్యుడు, బీజేపీ నేత యశ్ పాల్ సువర్ణ, శ్రీ రాం సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ ల తలలు తెగనరికితే నజరానా ఇస్తామంటూ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ కలకలం రేపింది. 

దీనిపై ఉడుపి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి బెదిరింపులు రావడం సహజమేనని, దేశం కోసం పనిచేస్తున్నప్పుడు జాతి వ్యతిరేకులు, వారిని నడిపించే సంస్థలు, దేశ ద్రోహులు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుంటారని యశ్ పాల్ సువర్ణ అన్నారు. తన జీవితంలో ఆ బెదిరింపులు భాగమేనని, వాటిని పట్టించుకోనని అన్నారు. రాజ్యాంగ పరిధికి లోబడే తన పని తాను చేసుకుంటున్నానని పేర్కొన్నారు. 

ఆ బెదిరింపులకు లొంగేది లేదని, అడుగు వెనక్కు వేసే సమస్యే లేదని తేల్చి చెప్పారు. అయితే, ఈ బెదిరింపుల వెనక ఉన్న స్థానిక వ్యక్తులు ఎవరన్న విషయాన్ని తేల్చాలని, వాళ్లెవరన్నది తామే నిగ్గు తేలుస్తామని ఆయన స్పష్టం చేశారు. క్లాసు రూంలో హిజాబ్ ను ధరించేందుకు ప్రయత్నించిన 24 మంది విద్యార్థులను నిన్న ఉప్పనంగడిలోని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. నిరసనలు చేపట్టేందుకు ప్రయత్నించిన వారికి నోటీసులనూ ఇచ్చింది. బయటి శక్తుల కుతంత్రాలకు లొంగి.. కర్ణాటక హైకోర్టు తీర్పును కాలరాసిన విద్యార్థులు మూడు రోజుల్లోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.


More Telugu News