ఒక్క‌సారిగా పెరిగిన క‌రోనా కేసులు.. దేశంలో ఒకే రోజు 5 వేల‌కు పైగా కొత్త కేసులు

  • కొత్త‌గా 5,233 క‌రోనా కేసుల న‌మోదు
  • కేర‌ళ‌లో అత్య‌ధికంగా 2,271 కేసులు
  • క‌రోనాతో ఏడుగురి మృత్యువాత‌
  • కోలుకున్న వారి సంఖ్య 3,345 మంది
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28,857
దేశంలో క‌రోనా విస్తృతి ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఇటీవ‌లి కాలంలో రోజుకు 2 నుంచి 4 వేల లోపు కొత్త కేసులు న‌మోదవుతుండ‌గా... మంగ‌ళ‌వారం మాత్రం కొత్త కేసుల సంఖ్య ఏకంగా 5 వేలు దాటిపోయింది. అదే స‌మ‌యంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతూ ఆందోళ‌న రేకెత్తిస్తోంది.  

మంగ‌ళ‌వారం దేశ‌వ్యాప్తంగా 3,13,361 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌గా... 5,233 కొత్త కరోనా కేసులు న‌మోద‌య్యాయి. వెర‌సి క‌రోనా పాజిటివిటీ రేటు 1.67 శాతం మేర ఎగ‌బాకింది. 93 రోజుల త‌ర్వాత దేశంలో ఇలా కొత్త‌గా 5 వేల కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. సోమ‌వారం న‌మోదైన కొత్త కేసుల (3,714)‌తో పోలిస్తే.. మంగ‌ళ‌వారం కొత్త కేసుల్లో 41 శాతం మేర పెరుగుద‌ల న‌మోదైంది. 

ఇక కొత్త‌గా న‌మోదైన కేసుల్లో మ‌హారాష్ట్ర, కేర‌ళ‌ల్లోనే అత్య‌ధిక కేసులు వున్నాయి. కేర‌ళ‌లో అత్య‌ధికంగా 2,271 కేసులు న‌మోదు కాగా... మ‌హారాష్ట్రలో 1,881 కేసులు న‌మోద‌య్యాయి. మ‌హారాష్ట్రలో న‌మోదైన కేసుల్లో 1,242 కేసులు ఒక్క ముంబైలోనే న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక మృతుల విష‌యానికి వ‌స్తే... దేశంలో మంగ‌ళ‌వారం క‌రోనాతో ఏడుగురు మృత్యువాత ప‌డ్డారు. దీంతో ఇప్ప‌టిదాకా క‌రోనా కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 5,24,715కు చేరింది.

మంగ‌ళ‌వారం క‌రోనా నుంచి 3,345 మంది కోలుకున్నారు. ఫ‌లితంగా క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య దేశంలో 4.26 కోట్లు దాటింది. అయితే కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల కంటే రిక‌వరీ అవుతున్న వారి సంఖ్య త‌గ్గిన నేప‌థ్యంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28,857గా న‌మోదైంది. క్ర‌మంగా యాక్టివ్ కేసులు పెరుగుతున్న వైనం ఆందోళ‌న రేకెత్తిస్తోంది.


More Telugu News