భార్యకు ప్రభుత్వ ఉద్యోగం.. విడిచి వెళ్లిపోతుందన్న అనుమానంతో చెయ్యి నరికేసిన భర్త

  • పశ్చిమ బెంగాల్‌లో ఘటన
  • ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన  భార్య
  • వద్దంటూ గొడవ పడిన భర్త
  • ఉద్యోగం చేసేందుకే భార్య మొగ్గు
  • ఆగ్రహంతో చేయి నరికేసి పరారైన భర్త
తనకు కాకపోయినా భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందుకు ఏ భర్త అయినా సంతోషిస్తాడు. కానీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన షేర్ మహమ్మద్ మాత్రం భయపడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆమె తనను విడిచి వెళ్లిపోతుందేమోనని అనుమానించాడు. ఆమె వెళ్లిపోతే తన గతేంకానని భయపడ్డాడు. చివరికి ఆమె చేయిని నరికేశాడు. 

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని తూర్పు బర్ధమాన్ జిల్లా కోజల్సా గ్రామానికి చెందిన షేర్ మహమ్మద్-రేణు ఖాతున్ భార్యాభర్తలు. దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో నర్సింగ్‌లో శిక్షణ పొందుతున్న రేణు.. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.

ఉద్యోగం రావడంతో ఆమె ఎగిరి గంతేయగా, భర్తకు ఆమె ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఉద్యోగానికి వెళ్లొద్దని, ఇంటి వద్దే ఉండాలని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అయినప్పటికీ ఆమె ఉద్యోగం చేసేందుకే మొగ్గు చూపింది. తన మాటను ఆమె లక్ష్యపెట్టకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన షేర్ మహమ్మద్ ఆమె కుడి చేయిని నరికేశాడు. ఆపై పరారయ్యాడు. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు చేయిని మొత్తం తొలగించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.



More Telugu News