వీల్ చెయిర్ కే పరిమితమైన ఇస్రో యువ శాస్త్రవేత్తకు సివిల్స్ లో 271వ ర్యాంకు

  • ఇటీవల సివిల్స్ ఫలితాలు వెల్లడించిన యూపీఎస్సీ
  • అనుకున్నది సాధించిన పాతికేళ్ల కార్తీక్ కన్సాల్
  • గతంలో 813వ ర్యాంకు
  • పట్టువదలకుండా ప్రయత్నించిన యువకుడు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ పరీక్ష ఫలితాలు వెల్లడించిన ప్రతిసారి సివిల్స్ ఆశావహుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ఎందుకంటే, కొందరు సివిల్స్ టాపర్ల జీవితాలు ఒడుదుడుకులమయం అయినా, కష్టాల కడలికి ఎదురీది అనుకున్నది సాధిస్తారు. తద్వారా అనేకమందికి స్ఫూర్తిగా నిలుస్తారు. కార్తీక్ కన్సాల్ జీవితం కూడా ఇలాంటిదే.

25 ఏళ్ల కార్తీక్ కన్సాల్ ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. యూపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో కార్తీక్ కు 271వ ర్యాంకు లభించింది. పూర్తి ఆరోగ్యంతో ఉండి ఇలాంటి ర్యాంకు సాధిస్తే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ కార్తీక్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో వీల్ చెయిర్ కే పరిమితం అయ్యాడు. ఎనిమిదేళ్ల వయసులో అతడు మస్క్యులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న విషయం వెల్లడైంది. ఇతర పిల్లల్లా బయట తిరగడం, ఆటలు ఆడడం అతడి జీవితంలో లేకుండా పోయాయి. జీవితంలో అత్యధిక భాగం చికిత్సలు, యోగాతోనే సరిపోయింది. 

జబ్బుతో శారీరకంగా బలహీనపడినా, అతడి మానసిక స్థైర్యం మాత్రం అమోఘం. చదువుల్లో మేటిగా ఉండేవాడు. ఐఐటీ రూర్కీ నుంచి 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్, గేట్ వంటి పరీక్షలు రాసినా, అతడి శారీరక వైకల్యం కారణంగా ఉద్యోగం లభించలేదు. ఆ తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో శాస్త్రవేత్తగా ఉద్యోగం లభించింది. ప్రస్తుతం శ్రీహరికోటలో పనిచేస్తున్నాడు.

 అయితే, సివిల్స్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న కార్తీక్ కన్సాల్ 2019లో తొలిసారిగా సివిల్స్ రాశాడు. 813 ర్యాంకు వచ్చింది. ఆ ర్యాంకుతో తాను కోరుకున్న రెవెన్యూ విభాగం పోస్టు రాదని తెలుసుకున్న కార్తీక్, రెట్టించిన పట్టుదలతో మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి మెరుగైన ర్యాంకుతో అనుకున్నది సాధించి, తనలాంటివారెందరికో స్ఫూర్తిగా నిలిచాడు. గతంలో ఇంజినీరింగ్ సర్వీసులకు తనను అనర్హుడిగా పేర్కొనడం ఎంతో బాధించిందని, ఆ సంఘటనే తనలో పట్టుదలను మరింత పెంచిందని కార్తీక్ కన్సాల్ వెల్లడించాడు.


More Telugu News