నీళ్లే నిప్పులై పేలాయ్.. మూడు రోజులవుతున్నా ఆరని మంటలు.. బంగ్లాదేశ్ పేలుడు ఘటనపై అధికారుల ప్రకటన

  • హైడ్రోజన్ పెరాక్సైడ్ పై తప్పుడు లేబుల్స్
  • ఫోమ్ కు బదులు నీళ్లు కొట్టిన అగ్నిమాపక సిబ్బంది
  • ఒక్కసారిగా సంభవించిన పేలుడు
  • 500 అడుగుల ఎత్తుకు ఎగిరిన కంటెయినర్
  • కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడిన జనం
గత ఆదివారం బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కు సమీపంలోని సీతాకుండ వద్ద ఓ కంటెయినర్ పేలి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వందలాది మంది గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం రసాయనాల సీసాలపై తప్పుడు లేబుల్స్, నీళ్లే కారణమని అధికారులు తేల్చారు. ఆ తప్పుడు లేబుల్స్ ను చూసిన అగ్నిమాపక సిబ్బంది నీటిని కొట్టడంతో ఆ రసాయనాలు పేలిపోయాయని అన్నారు. 

అంతేగాకుండా ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్యనూ సరిచేశారు. నిన్నటిదాకా 49 మంది చనిపోయారని చెబుతుండగా.. 41 మందే చనిపోయారంటూ ఆ సంఖ్యను సరిచేశారు. 300 మంది గాయపడ్డారు. అందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. చాలా మంది ఆచూకీ గల్లంతైంది. 

హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్స్ సీసాల మీద తప్పుడు లేబుల్స్ ఉన్నాయని, దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్న వెంటనే మంటలను ఆర్పేందుకు నీళ్లు కొట్టారని అగ్నిమాపక దళం అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణచంద్ర మట్సుద్ది చెప్పారు. వాస్తవానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటుకున్న మంటలను ఫోమ్ తో ఆర్పివేయాల్సి ఉంటుందని, కానీ, అది హైడ్రోజన్ పెరాక్సైడ్ అని తెలియకపోవడంతో తెలియకుండానే సిబ్బంది నీళ్లుచల్లారని అన్నారు. 

నీళ్లు పడీపడగానే ఒక్కసారిగా పేలుడు సంభవించిందని, కంటెయినర్ 500 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిందని, సమీపంలో ఉన్నవాళ్లు కొన్ని మీటర్ల దూరంలో పడ్డారని చెప్పారు. ప్రమాదం జరిగి మూడు రోజులవుతున్నా మంటలు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయని, కొన్ని చోట్ల ఇంకా మంటలు ఆరలేదని పేర్కొన్నారు. 

మరోవైపు అసలు మంటలు అంటుకోవడానికి ప్రాథమిక కారణమేంటన్న దానిపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ కారణమేంటో తెలియరాలేదు. చనిపోయిన వారిని గుర్తించేందుకు వీలుగా అధికారులు డీఎన్ఏ టెస్టులు చేస్తున్నారు.


More Telugu News