నన్నేం చేయలేరు.. ఇలాంటి కేసులకు భయపడే వాడిని కాదు!: బీజేపీ నేత రఘునందన్ రావు

  • గ్యాంగ్ రేప్ బాధితురాలి వివరాలను బయటపెట్టారని రఘునందన్ పై కేసు నమోదు
  • పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారన్న బీజేపీ ఎమ్మెల్యే
  • తనకు కేసులు కొత్త కాదని వ్యాఖ్య
హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ అంశానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితురాలి వివరాలను బయటపెట్టారనే ఆరోపణలతో ఆయనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 228 (ఏ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వబోతున్నారు. 

ఈ నేపథ్యంలో రఘునందన్ రావు మాట్లాడుతూ, మైనర్ బాలికకు న్యాయం చేయాలని తాను పోరాడుతుంటే పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఇలాంటి కేసులకు తాను భయపడే వాడిని కాదని చెప్పారు. కేసులు తనకు కొత్త కాదని... తెలంగాణ ఉద్యమ సమయంలో 70కి పైగా కేసులను ఎదుర్కొని ఇంత వరకు వచ్చానని అన్నారు. 

ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నందున టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మౌనంగా ఉన్నాయని విమర్శించారు. ఎంఐఎం నేత కుమారుడిని కాపాడేందుకు యత్నిస్తున్నాయని చెప్పారు. మీకు కేసు వాదించేందుకు లాయర్లు కావాలని... తనకు ఆ అవసరం లేదని, సుప్రీంకోర్టు వరకు తానే వాదించుకోగలనని అన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News