ముంబైలో వేగంగా పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు

  • పాజిటివిటీ రేటు 8.8 శాతానికి చేరిక
  • రాష్ట్ర సగటు 4.5 శాతం కంటే రెట్టింపు
  • థానేలో 20 శాతంగా నమోదు
  • పరీక్షల సంఖ్యను పెంచాలని సర్కారు ఆదేశం
ముంబైలో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతుండడం అక్కడి అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర కేబినెట్ సైతం సోమవారం ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. మిలియన్ ప్రజలకు అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్న రెండో రాష్ట్రం మహారాష్ట్ర. కేరళలో ప్రతి 10 లక్షల మందికి 264 యాక్టివ్ కేసులు ఉంటే, ముంబైలో అది 53 కేసులుగా ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ రేటు 4.5 శాతానికి చేరుకోగా (పరీక్షల్లో పాజిటివ్ గా తేలుతున్న కేసులు).. ముంబైలో మాత్రం 8.8 శాతం, పాల్గర్ లో 4.9 శాతంగా పాజిటివిటీ రేటు ఉంది. అంటే ఈ రెండు ప్రాంతాలు రాష్ట్ర సగటు పాజిటివ్ రేటును దాటిపోయాయి. థానే పట్టణంలో పాజిటివిటీ రేటు సోమవారం 20 శాతంగా నమోదైంది. 

రాష్ట్ర సగటుతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో పాజిటివ్ రేటు ఉన్నందున పరీక్షల సంఖ్యను ముంబైలో పెంచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ 25,000 పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంటే చాలా తక్కువ స్థాయిలోనేనని తెలుస్తోంది. జ్వరం, జలుబు, ఫ్లూ లక్షణాలతో వచ్చే ప్రతీ వ్యక్తికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

మరోవైపు ముంబైలోని ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సోమవారం 54 మంది ఆసుపత్రుల్లో కరోనాతో చేరారు. దీంతో ఆసుపత్రుల్లోని కరోనా రోగుల సంఖ్య 219కు పెరిగింది. మొత్తం కరోనా కేసుల్లో 1.04 శాతం కేసుల్లోనే సీరియస్ గా ఉన్నట్టు మంత్రి రాజేష్ తోపే తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద వెంటిలేటర్ పై ఉన్న కరోనా రోగులు ముగ్గురేనని చెప్పారు. 96 శాతం కేసుల్లో లక్షణాలు ఉండడం లేదని తెలిపారు. ప్రస్తుతానికి ఎటువంటి ఆంక్షల విధింపు ప్రతిపాదన కూడా లేదని స్పష్టం చేశారు.


More Telugu News