సొంత సభ్యుల నుంచే అవిశ్వాస తీర్మానం.. ఎదురులేదనిపించుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

  • ‘పార్టీ గేట్’ కుంభకోణం నేపథ్యంలో సొంత పార్టీ నుంచే ఒత్తిడి
  • అవిశ్వాస తీర్మానంలో జాన్సన్‌కు అనుకూలంగా 211 ఓట్లు
  • 59 శాతం మంది చట్ట సభ్యుల మద్దతు పొందిన ప్రధాని
సొంత కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఎదురైన అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనకు తిరుగులేదనిపించుకున్నారు. ‘పార్టీ గేట్’ కుంభకోణం నేపథ్యంలో సొంత పార్టీ సభ్యులే జాన్సన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందులో జాన్సన్‌కు అనుకూలంగా 211 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 148 ఓట్లు వచ్చాయి. ఫలితంగా 59 శాతం మంది చట్ట సభ్యుల విశ్వాసాన్ని ఆయన చూరగొన్నారు. 

2019 ఎన్నికల్లో విజయం సాధించిన బోరిస్.. కరోనా నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో తన డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం, తన నివాసంలో స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకోవడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ఇటీవల ఆయన పార్లమెంటులో క్షమాపణలు కూడా తెలిపారు.  

కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో మద్యం పార్టీ చేసుకోవడం వివాదాస్పదం కావడంతో సొంతపార్టీకి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రులు జాన్సన్‌ను తప్పుబట్టారు. ఆయన చర్య ఓటర్లలో విశ్వాసాన్ని దెబ్బతీసిందని, కాబట్టి ఆయన పదవి నుంచి వైదొలగాలంటూ కొన్ని వారాల క్రితం 40 మందికిపైగా ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అందులో బోరిస్ విజయం సాధించారు.


More Telugu News