మ‌రో రెండేళ్లు ఏపీ స‌ర్వీసులోనే టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి

  • టీటీడీ ఈవోగా గ‌త నెల‌లో ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ధ‌ర్మారెడ్డి
  • ఇప్ప‌టికే ఏపీలో ఏడేళ్ల స‌ర్వీసు పూర్తి చేసుకున్న సెంట్ర‌ల్ స‌ర్వీసెస్ అధికారి
  • మ‌రో రెండేళ్ల పాటు ధ‌ర్మారెడ్డిని ఏపీలోనే కొన‌సాగించాల‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వం
  • అంగీక‌రిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసిన కేంద్ర ప్ర‌భుత్వం
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ)లో ప్ర‌స్తుతం ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (ఫుల్ అడిష‌న‌ల్ చార్జెస్‌) హోదాలో ప‌నిచేస్తున్న ధ‌ర్మారెడ్డి మ‌రో రెండేళ్ల పాటు ఏపీ స‌ర్వీసులోనే కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది. కేంద్ర స‌ర్వీసుల‌కు చెందిన ధ‌ర్మారెడ్డి... ఇప్ప‌టికే ఏడేళ్ల పాటు ఏపీ స‌ర్వీసులో కొన‌సాగారు. ఏ సెంట్ర‌ల్ సర్వీసు అధికారి అయినా రాష్ట్ర స‌ర్వీసుల్లో అత్య‌ధికంగా ఏడేళ్ల‌కు మించి ప‌నిచేయ‌డానికి వీల్లేదు. ఈ లెక్క‌న ధ‌ర్మారెడ్డి తిరిగి కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిపోక త‌ప్ప‌ని ప‌రిస్థితిపై ఇటీవ‌లే పెద్ద ఎత్తున క‌థ‌నాలు వినిపించాయి.

అయితే ధ‌ర్మారెడ్డి సేవ‌ల‌ను ఎలాగైనా పొడిగించుకోవాల్సిందేనన్న దిశ‌గా సాగిన ఏపీ ప్ర‌భుత్వం... మ‌రో రెండేళ్ల పాటు ధ‌ర్మారెడ్డి ఏపీ స‌ర్వీసులోనే కొన‌సాగేలా అనుమ‌తి ఇవ్వాల‌ని, ఈ కేసును ప్ర‌త్యేక‌మైన‌దిగా ప‌రిగ‌ణించాల‌ని ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. ఒకవేళ ఈ దిశ‌గా కేంద్రం అంగీక‌రించ‌కపోతే... ధ‌ర్మారెడ్డితో కేంద్ర స‌ర్వీసుల‌కు రాజీనామా చేయించి ఆయ‌న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారిగా నియ‌మించుకుని టీటీడీలోనే కొన‌సాగించే దిశగా ఏపీ ప్ర‌భుత్వం భావించింది.

అయితే ఏపీ ప్ర‌భుత్వానికి ఆ అవ‌స‌రం లేకుండానే కేంద్రం సోమ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ధ‌ర్మారెడ్డి సేవ‌ల‌ను మ‌రో రెండేళ్ల‌పాటు ఏపీలోనే కొన‌సాగేలా ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో 2024 వ‌ర‌కు ధ‌ర్మారెడ్డి ఏపీ స‌ర్వీసులోనే కొన‌సాగ‌నున్నారు. వాస్త‌వానికి టీటీడీ అద‌న‌పు ఈవోగా కొన‌సాగుతున్న ధ‌ర్మారెడ్డి గ‌త నెల 8న టీటీడీ ఈవోగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టిదాకా ఆ పోస్టులో కొన‌సాగిన జ‌వ‌హ‌ర్ రెడ్డి ఏపీ సీఎంఓకు బ‌దిలీ కావ‌డంతో ఆ పోస్టులో అద‌న‌పు ఈవోగా ఉన్న ధ‌ర్మారెడ్డిని పూర్తి బాధ్య‌త‌ల‌తో ఏపీ ప్ర‌భుత్వం నియ‌మించింది.


More Telugu News