తెలంగాణ ఆరోగ్య శాఖ‌లో ఖాళీల భ‌ర్తీ... కరోనా వారియ‌ర్లకు 20 శాతం వెయిటేజీ

  • ఆరోగ్య శాఖ‌లో 1,326 ఖాళీలు
  • వాటి భ‌ర్తీకి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్‌
  • ఆరోగ్య, ఆర్థిక శాఖ అధికారుల‌తో మంత్రి హ‌రీశ్ రావు భేటీ
  • వెయిటేజీపై చిక్కులు రాకుండా చూడాలంటూ ఆదేశాలు
తెలంగాణ ఆరోగ్య శాఖ‌లో ఖాళీల భ‌ర్తీకి ఆ శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు చ‌ర్య‌లు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయ‌న సోమ‌వారం వైద్య‌, ఆరోగ్య శాఖ‌, ఆర్థిక శాఖ అధికారుల‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ఆరోగ్య శాఖ‌లో 1,326 పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్టుల భ‌ర్తీకి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ విడుద‌ల చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలంటూ హ‌రీశ్ రావు మెడిక‌ల్ బోర్డు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ నోటిఫికేష‌న్‌లో భ‌ర్తీ చేసే పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే క‌రోనా వారియ‌ర్ల‌కు 20 శాతం వెయిటేజీ ఇచ్చేలా  నోటిఫికేష‌న్ జారీ చేయాల‌ని హ‌రీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. క‌రోనా కాలంలో ఆరోగ్య శాఖ‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో ప‌నిచేస్తున్న సిబ్బంది త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి సేవ‌లందించార‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి పేర్కొన్నారు. వెయిటేజీ విషయంలో మున్ముందు న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఎదురుకాకుండా నోటిఫికేష‌న్‌లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అధికారుల‌కు సూచించారు.


More Telugu News