ట్విట్టర్ కొనుగోలు నిర్ణయానికి మంగళం పాడనున్న ఎలాన్ మస్క్!

  • ట్విట్టర్ పై మోజు పడిన మస్క్
  • రూ.3 లక్షల కోట్లు ఆఫర్
  • ఏమాత్రం ముందుకు కదలని డీల్
  • స్పామ్ అకౌంట్లపై స్పష్టత కావాలంటున్న మస్క్
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ను కొనుగోలు చేయాలని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎంతగానో ఉవ్విళ్లూరడం తెలిసిందే. ట్విట్టర్ ను సొంతం చేసుకునేందుకు రూ.3 లక్షల కోట్లు ఆఫర్ చేసినా, ఇప్పటికీ ఒప్పందం కుదరలేదు. ట్విట్టర్ లో ఉన్న ఖాతాలన్నీ అసలైనవేనా? వాటిలో ఫేక్ ఖతాలెన్ని? అనే అంశాల్లో ఎలాన్ మస్క్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తన ప్రశ్నలకు ట్విట్టర్ యాజమాన్యం సరైన సమాధానం ఇస్తేనే ఒప్పందం ముందుకు కదులుతుందని ఆయన ఇప్పటికే తేల్చిచెప్పారు. 

తాజాగా, తన వైఖరిని మరింత స్పష్టం చేశారు. ఈ డీల్ నుంచి తాను తప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, స్పామ్/ఫేక్ అకౌంట్లకు సంబంధించిన డేటాను ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైందని భావిస్తున్నట్టు మస్క్ తెలిపారు. కొనుగోలు ఒప్పందాన్ని అనుసరించి ట్విట్టర్ తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలను నిరాకరిస్తోందన్న విషయం తెలుస్తూనే ఉందని ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. ప్రస్తుతానికి ఈ ఒప్పందాన్ని తాను తాత్కాలికంగా పక్కనబెడుతున్నానని వెల్లడించారు.


More Telugu News